Bandi Sanjay: ‘బండి’ పరువుకి గండి

Bandi Sanjay బండి సంజయ్ కుమార్ బీజేపీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. దుబ్బాక, బల్దియాల్లో పార్టీని గెలిపించి ఒక వెలుగు వెలిగారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయేసరికి ఆయన్ని ఎవరూ పట్టించుకుంటున్నట్లు లేరు. చివరికి అదే బల్దియాలోని ఒక కార్పొరేటర్ స్థాయి లీడర్ కూడా బండి సంజయ్ ని దేఖట్లేదని నిన్న జరిగిన ఓ సంఘటనను బట్టి అర్థంచేసుకోవచ్చు. మామూలుగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రాంచందర్ రావు తదితరుల బ్యాచ్ ఎలాగూ బండిని పెద్దగా పరిగణనలోకి తీసుకోదు. వాళ్ల దారి వాళ్లదే. ఆయన దారి ఆయనదే. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో. అయితే ఇప్పుడు వేరే విషయంలోనూ ఈ ముఠా.. బండిని సంప్రదించకుండా ఓ నిర్ణయం తీసుకోవటం ఆయనకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

ఏం జరిగింది?..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ లో బీజేపీ తరఫున గెలిచిన ఆకుల రమేష్ గౌడ్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే కన్నుమూశారు. ఆ స్థానానికి ఈ నెల 30న ఉప ఎన్నిక ఉంది. కమలం పార్టీ నుంచి రమేష్ గౌడ్ కుమారుడు బరిలో ఉన్నాడు. అధికార పార్టీ టీఆర్ఎస్ తో పోటీపడి పోలింగ్ కి వెళ్లినా సానుభూతి ఓట్లతో రమేష్ గౌడ్ కొడుకే గెలిచేవాడు. ఆ మాత్రం దానికి మళ్లీ ఎన్నికల ప్రచారం, బోలెడు డబ్బు ఖర్చు ఎందుకని ఆ ఫ్యామిలీ అనుకున్నట్లుంది. ఏకగ్రీవం కోసం ప్రయత్నం చేద్దామని భావించారు. ప్రధాన ప్రత్యర్థి గులాబీ పార్టీయే కాబట్టి ముందు ఆ నాయకత్వంతో మాట్లాడితే పనైపోతుందని తీర్మానానికొచ్చారు. చివరికి అదే జరిగింది.

సంజయ్ కి చెప్పకుండా..

ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(టీఆర్ఎస్), రమేష్ గౌడ్ సతీమణి, కుమారుడు, లింగోజిగూడకు చెందిన మరికొందరు నేతలు అనుకున్నదే తడవుగా కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ని నిన్న శుక్రవారం రాత్రి ప్రగతిభవన్ లో కలిశారు. తమ ప్రతిపాదనని ఆయన ముందు పెట్టారు. కేటీఆర్ తమ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కి చెప్పగా ఆయనా సరే అన్నారు. కేటీఆర్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి ఏకగ్రీవానికి సహకరించాలని కోరారు. ఇవన్నీ ఆహ్వానించదగ్గ పరిణామాలే. కానీ, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కి చెప్పకుండా చేయటం సరికాదు. కానీ వాళ్లు ఎందుకు అతణ్ని అడగలేదో తెలియదు. అడిగితే ‘వద్దు’ అంటాడనుకున్నారేమో. విషయం తెలిసిన తర్వాత ఆయన స్పందన కూడా దాదాపు ఇలాగే ఉండటం గమనార్హం.

గెలిచేవారు.. గేలి చేశారు..

లింగోజిగూడ బైఎలక్షన్ విషయంలో బీజేపీ సిటీ లీడర్లు వ్యవహరించిన తీరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుపట్టారు. తనకు తెలియకుండా కేటీఆర్ ని ఎందుకు కలిశారని ప్రశ్నించారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా చీఫ్ సామ రంగారెడ్డిని కడిగేశారు. ‘గ్యారంటీగా గెలిచే స్థానం. ఎన్నికల్లో పోరాటం చేసి నెగ్గాలి. ఏకగ్రీవానికి ఎందుకు తొందరపడ్డారు? అసలు ఎలా అక్కడికి వెళ్లారు? ఇది సరికాదు. మళ్లీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే బాగుండదు’’ అని బండి సంజయ్ క్లాస్ పీకినట్లు వార్తలొచ్చాయి. మరో సీనియర్ లీడర్ ని(బహుశా మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావుని అయుంటుంది) వివరణ కోరినట్లు కూడా తెలుస్తోంది. బండి సంజయ్ కుమార్ తాజా పరిస్థితిని చూస్తుంటే ‘‘పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నేనొకణ్ని ఉన్నానని గుర్తించండి’’ అంటూ తన ఉనికిని తానే చాటుకుంటున్నట్లు కనిపిస్తోంది.

Advertisement