Bihar: బీహార్‌లో బయటపడ్డ ప్రమాదకార వేరియెంట్.. వణికిపోతున్న ప్రజలు
NQ Staff - April 29, 2022 / 12:26 PM IST

Bihar: కొంత శాంతించిన కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్లీ బుసలు కొడుతుంది. దేశంలో కేసులు క్రమక్రమంగా పెరుగుతూ పోతున్నాయి. ఢిల్లీలో ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య భయపెడుతోంది. ఇంతలోనే కరోనా కొత్త సబ్ వేరియంట్‌ను గుర్తించినట్లు బీహార్ అధికారులు ప్రకటించారు. ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో బీఏ.12 వేరియంట్ బయటపడినట్లు తెలిపారు.

Bihar Reports Its First Case of New, More Infectious Omicron Sub-Variant BA.12
ఇది కరోనా థర్డ్ వేవ్‌లో వెలుగుచూసిన బీఏ.2 సబ్ వేరియంట్‌కంటే పదిరెట్లు ప్రమాదకరమని హెచ్చరించారు. అంతే వేగంగా జనాలకు సోకుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకిన ఓ వ్యక్తి శాంపిల్ కు పాట్నాలోని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్)లో జన్యు క్రమ విశ్లేషణ చేయగా బీఏ 12 పాజిటివ్ గా వెల్లడైందని అధికారులు చెప్పారు. 13 శాంపిళ్లు ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలగా.. అందులో 12 శాంపిళ్లు బీఏ 2 అని, ఇంకొకటి వేగంగా వ్యాపించే గుణం ఉన్న బీఏ 12 అని గుర్తించారు.
ఈ ఉపరకం కరోనా చాలా ప్రమాదకరమైందని ఐజీఐఎంఎస్ మైక్రోబయాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ నమ్రత హెచ్చరించారు. ఇతర ఒమిక్రాన్ ఉప రకాలతో పోలిస్తే దీని సంక్రమణ శక్తి చాలా చాలా రెట్లు ఎక్కువని ఆమె తెలిపారు. వాస్తవానికి ఈ ఉప రకం తొలి కేసును తొలుత అమెరికాలో గుర్తించారు. గత వారం ఢిల్లీకీ పాకాయి. మూడు కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు బీహార్ లోనూ వెలుగు చూసింది.
దేశంలో కరోనా కేసులు పెరగడం కలవరపెడుతోంది. 46 రోజుల తర్వాత తొలిసారి 3 వేల మార్క్‌ను దాటాయి. అటు యాక్టివ్ కేసుల సంఖ్య 17వేలకు చేరువైంది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, కేరళ, మిజోరంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 14 వందల 90 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. పాజిటివిటీ రేటు 4.5శాతం దాటింది. పెరుగుతున్న కేసులతో పాటే యాక్టివ్ కేసులూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం 17,801 మంది ఇంకా మహమ్మారి కారణంగా బాధపడుతున్నారు.
తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 4,30,72,176కు పెరిగాయి. నిన్న 60 మంది మహమ్మారికి బలవగా.. మొత్తం మరణాల సంఖ్య 5,23,753కి చేరాయి. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ఇప్పటిదాకా 193.28 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను వినియోగించినట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది. 5 నుంచి 12 ఏళ్ల వారికి కరోనా టీకాలను ఇచ్చే విషయంపై ఇవాళ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.