Kesineni Nani: తన కూతురు మేయర్ పీఠం మీద కొండంత ఆశ పెట్టుకున్న కేశినేని నానికి భారీ దెబ్బ?
Ajay G - March 7, 2021 / 10:28 PM IST

Kesineni Nani : ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు బాగా వేడెక్కాయి. దానికి కారణం.. ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు. ఇటీవలే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి అని అనుకునే లోపే… మున్సిపల్ ఎన్నికల హడావుడి స్టార్ట్ అయింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రచారాన్ని ప్రారంభించాయి.
అయితే.. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో రాజకీయాలు ఒకలా ఉంటే.. విజయవాడలో ఇంకోలా ఉంటాయి. విజయవాడ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వరికీ అర్థం కావు.
తాజాగా.. విజయవాడ టీడీపీ నేతలు విభేదాలతో రోడ్డెక్కిన విషయం తెలిసిందే. పార్టీలోనే అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. విజయవాడలోనే టీడీపీ నేతల్లో వర్గాలు ఏర్పడ్డాయి. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వర్గం, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వర్గం ఏర్పడి.. ఒకరిని మరొకరు ఆడిపోసుకునే వరకు వెళ్లారు.
అలాగే.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా కేశినేని నానిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడలోనే నెక్స్ ట్ టీడీపీ ఎంపీ అభ్యర్థిని తానేనని.. దమ్ముంటే.. కేశినేని నాని ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరాడు.
ఓవైపు ఎన్నికలు.. మరోవైపు టీడీపీకి చాలెంజింగ్.. ఈ సమయంలో పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమనడంతో వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వెంటనే వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేశినేని శ్వేతకు మద్దతు ఇస్తామని.. వీళ్లంతా చంద్రబాబుకు మాటిచ్చారు.
నిజానికి.. కేశినేని నాని కూతురును విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంపై కొన్ని వర్గాలకు నచ్చడం లేదు. అందుకే ఈ పంచాయతీలన్నీ. అందుకే.. వీటన్నింటినీ గమనించిన శ్వేత.. వెంటనే బోండా ఉమా ఇంటికి వెళ్లి.. తనకు సహకరించాలంటూ అభ్యర్థించారు. దీంతో బోండా ఉమా వర్గం ఆమెకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించింది.
ఏది ఏమైనప్పటికీ.. సొంత పార్టీ నేతలే.. తన కూతురును మేయర్ కాకుండా అడ్డుకుంటున్నారని.. కేశినేని నాని రగిలిపోతున్నారు. దీనిపై ఏం చేయాలో ఆయనకు కూడా అర్థం కాని పరిస్థితి.