YS Sharmila : ప్రస్తుతం తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ గురించే చర్చ. ఆమె పార్టీ పేరు ఏది ప్రకటిస్తారు? పార్టీ విధివిధానాలేంటి? పార్టీలోకి ఎవరైనా చేరుతున్నారా? ఏ పార్టీల నేతలు షర్మిల పార్టీలో చేరుతారు? ఆ తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎలా మారుతాయి? ఇలా వంద డౌట్లు అందరికీ కలుగుతున్నాయి. వాటన్నింటికీ సమాధానం ఇంకో ఒక్క రోజులో దొరకనుంది. ఎందుకంటే… షర్మిల తన పార్టీ పేరును ప్రకటించేది రేపే. ఏప్రిల్ 9న ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్స్ లో షర్మిల సంకల్ప సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సభ ద్వారా తన పార్టీ గురించి, పార్టీ విధివిధానాలను షర్మిల ప్రజలకు వెల్లడించనున్నారు.

అయితే… ఈ సభ కోసం లోటస్ పాండ్ నుంచి ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్ వరకు సుమారు 100 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారట. భారీ ర్యాలీతో పాటే షర్మిల కూడా ఖమ్మం చేరుకోనున్నారట. తన తల్లి విజయమ్మ కూడా ఈ సభకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. తన తల్లి ఆశీర్వాదంతోనే పార్టీని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అయితే… వైఎస్సార్సీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయ మ్మ… షర్మిల సభకు వస్తారా? రారా? అనే డౌట్ ఉన్నప్పటికీ… విజయమ్మ ఖచ్చితంగా షర్మిల సభకు వస్తున్నారని లోటస్ పాండ్ వర్గాలు తెలిపినట్టు సమాచారం.
కార్ల ర్యాలీతో పాటు… షర్మిల అభిమానులు బైక్ లతో ర్యాలీలు నిర్వహించడానికి సిద్ధం అయ్యారట. కరోనా నేపథ్యంలో సభకు కేవలం 5 నుంచి 6 వేల మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్టు ఖమ్మం పోలీసులు వెల్లడించారు. షర్మిల సభ.. ఏప్రిల్ 9న సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు జరగనుంది. ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా… సభను నిర్వహించుకోవాలని పోలీసులు ఆదేశించారు. ఇక.. షర్మిల సభ అనంతరం.. ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు షర్మిల పార్టీలో చేరనున్నట్టు సమాచారం. వివిధ పార్టీల్లో అసంతృప్తితో ఉన్నవాళ్లు, పార్టీలో ప్రాధాన్యం లేనివాళ్లు కొందరు షర్మిల పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే… ఎవరు షర్మిల పార్టీలో చేరుతారు? ఎంత మంది చేరుతారు? అనే విషయం తెలియాలంటే రేపటి సభ కోసం వెయిట్ చేయాల్సిందే.