ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. అక్కడ జరిగేది మాత్రం ఒక్కటే పని. అదే భూఅక్రమాలు.. భూదందా… భూకబ్జా.. పేరు ఏదైనా.. అక్కడ జరుగుతున్నది ఒక్కటే. మనం మాట్లాడుకునేది వైజాగ్ గురించే. ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా వైజాగ్ పేరు మారుమోగిపోతోంది. ఎందుకంటే.. వైజాగ్ ఏపీకి పరిపాలనా రాజధాని కాబట్టి.

ఏపీకి పరిపాలనా రాజధాని అంటే.. ఇక అక్కడ భూముల ధరలు అలాగే ఉంటాయా? సుర్రున పైకి ఎగబాకవా? రాజధాని చేస్తున్నామనగానే విపరీతంగా అక్కడ భూముల ధరలు పెరిగాయి.
సరే.. వైసీపీ అంటే వైజాగ్ ను రాజధానిగా ప్రకటించింది. కానీ.. టీడీపీ ప్రకటించలేదు కదా అంటారా? అప్పట్లోనూ వైజాగ్ లో భూఅక్రమాలు విపరీతంగా జరిగాయి. ప్రభుత్వ భూములు ఎవరెవరి పేరు మీదనే రిజిస్టర్ అయ్యాయి.
ఇప్పుడు అంటే వైసీపీ ప్రభుత్వంలోనూ జరగుతున్నది అదే. ప్రభుత్వ భూములు ఎవరెవరి చేతుల్లోకో వెళ్తున్నాయి.
అయితే.. ఏ ప్రభుత్వం ఉన్నా.. అందరి చూపు వైజాగ్ మీదనే పడటానికి కారణం అక్కడ ఉన్న ప్రభుత్వ భూములు. వైజాగ్ లో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. విశాఖ జిల్లా కేంద్రంలో చుట్టుపక్కలే సుమారు 40 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయట. అందుకే రాజకీయ నాయకుల కళ్లు విశాఖ మీద పడ్డాయి.
వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గత 20 ఏళ్లలో సుమారు 7 వేల ఎకరాల ప్రభుత్వ భూమి చేతులు మారిందట. అయితే.. 2015 తర్వాతనే సుమారు 2 ఎకరాలు అన్యాక్రాంతం కావడంతో అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంపై ప్రస్తుతం అనుమానం మొదలైంది. అంటే టీడీపీ హయాంలో అవినీతి జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి… వైసీపీ దీనిపై ఎక్కువ ఫోకస్ చేస్తోంది. టీడీపీ ఎక్కడ దొరుకుతుందా? అని వైసీపీ ప్రభుత్వం ఆధారాల కోసం వెతుకుతోంది.
అయితే.. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే.. వైసీపీ హయాంలోనూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మరి.. దీనిపై ఫోకస్ ఎవరు పెట్టాలో?