Bandla Ganesh: నేను గెల‌వ‌డం ఖాయం.. నా వెనుక ఎవ‌రున్నారో తెలుసా?

Bandla Ganesh: అక్టోబ‌ర్10న జ‌ర‌గ‌నున్న మా ఎల‌క్షన్స్ నామినేష‌న్స్ సందడి మొద‌లైంది. ఒక్కొక్క‌రుగా నామినేష‌న్స్ వేస్తూ పోటీకి సిద్ధం అవుతున్నారు. జనరల్‌ సెక్రెటరీగా పోటీపడుతున్న బండ్ల గ‌ణేష్‌..`మా` ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. వినూత్న ప్రచారానికి తెర తీశారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్, సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. ఇక జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తున్న బండ్ల గణేష్ కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.

మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఇదే సమయంలో మా బిల్డింగ్‌పై బండ్ల గణేష్ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా’ ఎన్నికల్లో జనరల్‌ సెక్రటరీగా తన గెలుపు తథ్యమని, తనకు ఎంతమంది ఆశీర్వాదాలు ఉన్నాయో ఎవరికీ తెలియదని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. ‘మా’ ఎన్నికల్లో తాను రాకెట్‌లా దూసుకెళ్తున్నానని, తన విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. తాను గెలిస్తే, 100మంది పేద కళాకారులను డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మా అసోసియేష‌న్‌కి భ‌వ‌నం కావాలి. జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతంలో ప్యాలెస్‌ కడతామంటే కుదరదు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందో లేదో తెలియదు. నా అభిప్రాయం ఏంటంటే.. కాస్త దూరమైన కోకాపేట ప్రాంతంలో స్థలం తీసుకుని, 100మంది పేద కళాకారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టించాలి. సీఎం కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి ‘మహాప్రభూ మాకు స్థలం ఇప్పించండి. మా డబ్బులతో ఇళ్లు కట్టుకుంటాం’ అని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తే ఎంత గొప్పపనో మీరు పెద్ద మనసుతో ఆలోచించండి.

తెలుగు చిత్ర పరిశ్రమలో వినోదాన్ని పంచే కళాకారులు ఎంతోమంది ఉన్నాం. అలాంటిది వేరే వాళ్ల దగ్గరకు వెళ్లి ఫండ్‌ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? మన హీరోలు బంగారు గనులు. కోహినూర్‌ వజ్రాలు. ఆ వజ్రాలు ప్రకాశిస్తే, ఎన్నో భవనాలు కట్టవచ్చు. హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో ప్రోగ్రాం చేసి, వచ్చిన డబ్బుతోనే ఇళ్లు కట్టవచ్చు’’. ‘‘ప్రస్తుతం ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే ఏపీ రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడను. 11వ తేదీ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ మాట్లాడతా. ఈలోగా కొంపలు మునిగిపోయేది ఏమీ లేదు అని అన్నారు.

పాతికేళ్ల నుంచి చూస్తున్నాం. ‘బండ్ల గణేశ్‌ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారు’ అని జీవితా రాజశేఖర్‌ అనలేదు. దయచేసి ‘మా’లో మాకు గొడవలు పెట్టవద్దు. షూటింగ్‌ స్పాట్‌లో ‘మా’ సమస్యలు ప్రస్తావిస్తానని ఓ పెద్దాయన చెప్పాడు. ప్యానెల్స్‌ నిర్వహించి పార్టీలకు ‘మా’ సభ్యులు వెళ్లండి. వాళ్లు ఇచ్చే ఆతిథ్యం స్వీకరించండి. ఓటు వేస్తామని చెప్పండి. వాళ్లు ఇచ్చిన తాయిలాలూ పుచ్చుకోండి. కానీ, మనస్సాక్షికి చెబుతూ నాకు ఓటేయండి. నాకు పరమేశ్వరుడి మద్దతు ఉంది. ఎవ‌రు గెలిచినా నాకు ప్రెసిడెంటే అని బండ్ల చెప్పారు.