Bandi Vs Kanna: తెలంగాణ బీజేపీకి.. ఏపీ బీజేపీ గుణపాఠం..

Bandi Vs Kanna: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పని తీరు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ రెండు వేర్వేరు దారుల్లో పయనిస్తుండటం గమనార్హం. కేసీఆర్ గాంధీ హాస్పిటల్ ని సందర్శించి అక్కడి కొవిడ్ పేషెంట్లతో నేరుగా మాట్లాడి వాళ్లకు ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే. దీన్ని కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తప్పుపట్టగా ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ స్వాగతించటం విశేషం. కరోనా బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా చూసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సైతం తాడేపల్లి నివాసం నుంచి బయటకు రావాలని కన్నా లక్ష్మినారాయణ ఇవాళ ఆదివారం డిమాండ్ చేశారు. అంటే కేసీఆర్ చేసిన పని కరెక్టేనని, ఆయన్ని చూసి జగన్ నేర్చుకోవాలనేది ఏపీ బీజేపీ సదుద్దేశంగా కనిపిస్తోంది. మరి, బండి సంజయ్ కుమారేంటి కేసీఆర్ కేవలం ప్రచారం కోసమే అలా చేశాడని అంటున్నాడు?. దీన్నిబట్టి బండి సంజయ్ కుమార్ రాజకీయంగా ఇంకా చాలా పరిణతి సాధించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వెరైటీ దీక్ష..

రాజకీయ నాయకులు సహజంగా ఒక రోజు లేదా కనీసం ఒక పూట నిరసన దీక్ష చేస్తుంటారు. కన్నా లక్ష్మినారాయణ మాత్రం వెరైటీగా ఈరోజు రెండు గంటల పాటు దీక్ష చేసి విరమించారు. కొవిడ్ నివారణ, నియంత్రణలో వైఎస్సార్సీపీ సర్కారు వైఫల్యాన్ని పట్టిచూపేందుకు ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా టీకాల పంపిణీని కూడా రాజకీయం చేసిన ఘనత జగన్ కే చెల్లిందని కన్నా అన్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ గురించి కేంద్రం ముందే అలర్ట్ చేసినా ఏపీ గవర్నమెంట్ అలసత్వం ప్రదర్శించిందని తప్పుపట్టారు.

ఆ హక్కు.. జగన్ కి లేదు..

దేశం మొత్తం కొవిడ్ టీకాల పంపిణీకి మోడీ సర్కార్.. బడ్జెట్ లో రూ.35 వేల కోట్లు కేటాయించిందని, అందువల్ల ఈ విషయంలో కేంద్రాన్ని తప్పుపట్టే నైతిక హక్కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి లేదని కన్నా లక్ష్మినారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కరోనా సమస్యల పరిష్కార దిశలో పార్టీ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ ని ఒప్పిస్తామని హామీ ఇచ్చారు.