Bandi Sanjay Politics In Andhra Pradesh : ఏపీలో చక్రం తిప్పేందుకు సిద్ధమైన బండి సంజయ్..?
NQ Staff - September 4, 2023 / 05:21 PM IST

Bandi Sanjay Politics In Andhra Pradesh : తెలంగాణలో బీజేపీకి ఒక ఊపు తీసుకొచ్చిన బండి సంజయ్ త్వరలోనే ఏపీలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించి కేంద్రంలోనిపెద్దలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు ఊహగానాలు వస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బండి సంజయ్ నిద్ర లేకుండా చేశారనడంలో అతిశయోక్తి లేదు.ఎమ్మెల్సీ కవిత పేరు లిక్కర్ స్కాంలో వచ్చినప్పటి నుంచి ఆమెను అరెస్టు చేయిస్తామని పలుమార్లు సీఎం కేసీఆర్ ఫ్యామిలీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేసి బీజేపీకి మైలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒకానొక టైంలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే నమ్మకాన్ని పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ కల్పించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో బీజేపీ సభ్యుల సంఖ్య మూడుకు పెరగడానికి బండి సంజయ్ పాత్ర కూడా ఉందనే చెప్పాలి.కార్యకర్తల్లో నమ్మకం కల్పించడంతో పాటు బీజేపీకి తెలంగాణలో భవిష్యత్ ఉందని నిరూపించే ప్రయత్నం చేశాడు.
అయితే, అనుకోకుండా బండిని బీజేపీ పెద్దలు తప్పించి ఆ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మళ్లీ రాష్ట్ర బీజేపీ చీఫ్ పోస్ట్ కట్టబెట్టారు. బండిని అర్ధాంతరంగా తప్పించడంతో బీజేపీ శ్రేణులు, తెలంగాణ ప్రజానీకం కూడా ఒకింత షాక్ అయ్యారు. ఇంతలోనే బండికి జాతీయస్థాయిలో పదవిని కట్టబెట్టారు.ఇక ఏపీలో రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజును తప్పించి మాజీ కేంద్రమంత్రి పురంధరేశ్వరికి అధ్యక్షురాలిగా అవకాశం కల్పించారు.
ఆమెకు ఏపీ బీజేపీ చీఫ్ పోస్టు వచ్చినప్పటికీ పార్టీలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.వచ్చే ఎన్నికల్లో బీజేపీ జనసేనానీతో కలిసి ఎన్నికలకు వెళ్తుందని టాక్. కానీ పొత్తులపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని కథనాలు వస్తున్నా అవన్నీ ఊహగానాలే అని పార్టీ పెద్దలు కొట్టిపారేస్తున్నారు.
ఈ క్రమంలోనే బండి సంజయ్‌ను ఏపీ బీజేపీ ఇంచార్జిగా నియమించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లుసమాచారం.పురంధరేశ్వరికి తోడుగా ఒక ఫైర్ బ్రాండ్ అవసరం ఉందని ఢిల్లీ పెద్దలు భావించి ఉండవచ్చు. తెలంగాణలో కంటే ఏపీలో బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ పార్టీకి కాస్త ఊపు తీసుకురావాలంటే బండి అవసరం ఉందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు.ఏపీలో హిందూవులు మైనార్టీలుగా మారే అవకాశం ఉందని, ఆలయాల మీద అన్యమతస్తుల పెత్తనం పెరిగిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
దీంతో బండిని రంగంలోకి దించి వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు హిందూవులకు బీజేపీని దగ్గర చేయాలని ఢిల్లీ పెద్దలు స్కెచ్ గీసినట్లు సమాచారం. అదే నిజమైతే త్వరలోనే బండి ఏపీ బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇంచార్జిగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వీలైనన్నీ పార్లమెంట్ స్థానాలు పొందాలని అమిత్ షా ఇప్పటికే పథక రచన చేశారని, అందువల్లే బండి ఈ మధ్య ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారని టాక్.