Bandi Sanjay : రౌడీలకు, గుండాలకు టికెట్లు ఇచ్చారు.. బండి సంజయ్ ఫైర్?

Bandi Sanjay : తెలంగాణలో ఓ వైపు కరోనా విజృంభిస్తున్నా…. మరోవైపు పురపాలక ఎన్నికల హడావుడి మొదలైంది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ముగియగానే… పురపాలక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది ఒకరకంగా చెప్పాలంటే మినీ పురపోరు. గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మరో ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీంతో మరోసారి ఎన్నికలు హీటెక్కాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే. టీఆర్ఎస్ నేతలకు దీటుగా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.

bandi sanjay participates in warangal campaign
bandi sanjay participates in warangal campaign

పుర పోరు బాధ్యతను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీసుకున్నారు. తాజాగా వరంగల్ లో ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ పాల్గొని అధికార టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. అధికార పార్టీనే ఆయన టార్గెట్ చేశారు. వరంగల్ లో రోడ్ షో నిర్వహించిన బండి సంజయ్… గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ… ఎవరికి టికెట్లు ఇచ్చిందో తెలుసా? గుండాలకు, రౌడీలకు. వాళ్లంతా తలలు తీసేవాళ్లు. వాళ్లకా టీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చేది. తలలు, కాళ్లు, చేతులు.. ఏది నరకమంటే దాన్ని నరికేసేవాళ్లు. తలలు నరికే పార్టీనా మనకు కావాల్సింది.. వరంగల్ ను అభివృద్ధి చేసే పార్టీనా? ఓటేసేటప్పుడు మీరే నిర్ణయించుకోండి… ఆలోచించి ఓటేయండి.. అని గ్రేటర్ వరంగల్ ప్రజలకు బండి సంజయ్ సూచించారు.

వరంగల్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేయలేదు. చెత్త చెదారాన్ని తీసుకపోయి.. వడ్డేపల్లి చెరువులో కలుపుతున్నారు. అవే నీటిని ఇంటింటికి తాగునీరుగా అందిస్తున్నారు. మంచి నీళ్లను ఇచ్చే దిక్కు కూడా లేదు. గ్రేటర్ వరంగల్ లో బీజేపీని గెలిపిస్తే… ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీరు సరఫరా అయ్యేలా చూస్తాం. 2023 లో కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఆక్సిజన్ ప్లాంట్ కోసం కోట్లు కేటాయించింది. జీరో అకౌంట్ ఉన్నవాళ్లకు కేంద్రం డబ్బులు ఇస్తోంది. కేసీఆర్ కుటుంబం మాత్రం తెలంగాణ ప్రజల డబ్బు దోచుకొని విదేశాల్లో పెట్టుబడులు పెడుతోంది… అంటూ బండి సంజయ్ ఆరోపించారు.

Advertisement