Bandi Sanjay Into AP Politics : మీకు బైబిల్ కావాల… భగవద్గీత కావాలా…? బండి మార్క్ రాజకీయాలు ఇకపై ఏపీలో..!
NQ Staff - July 31, 2023 / 11:31 AM IST

Bandi Sanjay Into AP Politics :
బండి సంజయ్.. ఈ పేరుకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది అన్న కేసీఆర్ నోటి నుంచే.. బీజేపీ ఎదుగుతోంది జాగ్రత్త అనే స్థాయికి తెచ్చిన వ్యక్తి. అసలు ఊసేలేని పార్టీని ఉరుకులు పెట్టించాడు. యూత్ ను బీజేపీ వైపు మళ్లే విధంగా సక్సెస్ అయ్యాడు. తెలంగాణలో బీజేపీ అంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ముందు ఆ తర్వాత అనేంతగా మార్చేశాడు.
పార్టీని పరుగులు పెట్టించడంలో సక్సెస్ అయిన బండి సంజయ్ కు ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ కమిటీలోకి 8 మందిని మాత్రమే తీసుకున్నారు. అయితే బండి సంజయ్ సేవలు పార్టీకి బాగా అవసరం అని భావించిన జాతీయ అధిష్టానం.. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించ బోతుందంట.
బండి సంజయ్ లాంటి ఫైర్ బ్రాండ్ తెలంగాణలో పార్టీ ఇమేజ్ ను పెంచినట్టే ఏపీలో పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మొన్నటి వరకు ఏపీ ఇన్ చార్జిగా ఉన్న సునీల్ దేవ్ ధర్ ను పార్టీ పక్కన పెట్టేసింది. మొన్న ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో ఆయనకు చోటు దక్కలేదు.
త్వరలోనే మార్క్ రాజకీయం..

Bandi Sanjay Into AP Politics
దాంతో ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి పదవి నుంచి కూడా తప్పుకోనున్నారు ఆయన. సునీల్ దేవ్ ధర్ పార్టీని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కాబట్టి పార్టీని గ్రౌండ్ లెవల్ నుంచి బలోపేతం చేయగల బండి సంజయ్ అయితేనే బెటర్ అని భావిస్తున్నారంట. ఇక త్వరలోనే ఏపీలో ఆయన మార్క్ రాజకీయం మొదలు కాబోతోంది.
మీకు బైబిల్ కావాలా.. భగవద్గీత కావాలా అనే నినాదంతో బండి సంజయ్ రాజకీయాలు మొదలు పెట్టబోతున్నాడు. తెలంగాణలో బీజేపీని ఆయన బలోపేతం చేశాడు కాబట్టి ఆ ఎఫెక్ట్ కచ్చితంగా ఏపీలో ఉంటుంది. ఇది ఒక రకంగా బండి సంజయ్ పవర్ ఏంటో తెలియజేసేదే. బండి సంజయ్ కు ఏపీలో కూడా అభిమానులు ఉన్నారు. ఎలాగూ ఆయన స్పీచ్ లు ఏపీలోని జనాలు వింటూనే ఉన్నారు. కాబట్టి ఈజీగా అక్కడి ప్రజలను ఆకర్షించే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ నిపుణులు.