Bandi Sanjay : నవంబర్ 28 నుంచి బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర
NQ Staff - November 22, 2022 / 08:02 PM IST

Bandi Sanjay : బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర త్వరలో ప్రారంభించనున్నారు. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 15 లేదా 16 వరకు ఈ పాదయాత్ర సాగుతుంది. ఈ విషయాన్ని ప్రజా సంగ్రామ యాత్ర సహ ప్రముఖ్ టి. వీరేందర్ గౌడ్ వెల్లడించారు.
బాసర దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం భైంసా నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. బాసరలో ప్రారంభమయ్యే ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర, కరీంనగర్‌లో ముగియనుంది.
నాలుగు విడతల ప్రజా సంగ్రామ యాత్ర సూపర్ సక్సెస్..
తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతల పాదయాత్ర పూర్తయ్యింది. మొత్తంగా 21 జిల్లాల పరిధిలో 1,178 కిలోమీటర్ల మేర బండ సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ జరిగింది.
ఇదిలా వుంటే, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రతి విడత ప్రారంభంలోనూ జాతీయ నాయకులు పాల్గొంటున్నారు. అలాగే, ముగింపు కార్యక్రమాన్నీ జాతీయ నాయకులతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పాలనా వైఫల్యాల్ని ఎండగట్టేందుకు, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడుతోందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. గ్రామ స్థాయిలో బీజేపీ ఈ స్థాయిలో బలపడిందంటే బండి సంజయ్ పాదయాత్ర కారణంగానే.