Talasani: సినిమా టికెట్ ధ‌ర‌లు త‌గ్గించం..థియేట‌ర్స్ మూసివేయం: త‌ల‌సాని

Talasani:క‌రోనా వ‌ల‌న సినీ పరిశ్ర‌మ ఎన్ని ఇబ్బందులు ప‌డిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నిర్మాత‌లు చాలా న‌ష్ట‌పోయారు. ఇప్పుడు ఒమిక్రాన్ త‌రుముకొస్తున్న నేప‌థ్యంలో అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. దానిపై తాజాగా సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స్పందించారు. సినిమా టికెట్‌ ధరలు తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ఎక్కడో ఎవరో ధరలు తగ్గించారని, వారిని చూసి తాము కూడా అలా తగ్గించేది లేదని అన్నారు.

Audiences can happily enjoy says talasani1
Audiences can happily enjoy says talasani1

శుక్రవారం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులతో ఆయన భేటీ అయ్యారు. ప్రస్తుతం ప్రజలు థియేటర్లకు వెళ్లి ధైర్యంగా సినిమా చూడొచ్చని, కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందన్నారు. కరోనా థర్డ్‌వేవ్‌ వస్తుందన్న ఊహాగానాలు మొదలైన నేపథ్యంలో థియేటర్ల మూత, ఆక్యుపెన్సీ తగ్గింపు తదితర ప్రచారాలను నమ్మొదని మంత్రి తలసాని తెలిపారు.

‘కరోనా వల్ల రెండేళ్లుగా సినీ పరిశ్రమ ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో ఒమిక్రాన్‌ భయాలు మొదలయ్యాయి. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు. థియేటర్‌ ఆక్యుపెన్సీపై ఎలాంటి ఆంక్షలు లేవు. తెలంగాణ ప్రభుత్వం 100శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఇచ్చినా గత కొన్ని రోజులు ఆ స్థాయి ప్రేక్షకులు థియేటర్స్‌కు రావటం లేదు. ‘అఖండ’ విడుదలైన తర్వాత థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య కాస్త పెరిగింది.

Audiences can happily enjoy says talasani2
Audiences can happily enjoy says talasani2

త్వరలో భారీ బడ్జెట్‌ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి. థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. ఇలాంటి సమయంలో దర్శక-నిర్మాతలు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు దాదాపు పూర్తయ్యాయి. సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

గతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ఈ సందర్భంగా చర్చించినట్లు మంత్రి తలసాని వివరించారు. మంత్రితో భేటీ అయిన వారిలో నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, చినబాబు, యేర్నేని నవీన్‌, ప్రమోద్‌, అభిషేక్‌ నామా దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్‌ తదితరులు ఉన్నారు