Ashwin : టీమిండియా క్రికెటర్‌కి కరోనా.. ఇంగ్లండ్ పర్యటనకు దూరం
NQ Staff - June 21, 2022 / 10:39 AM IST

Ashwin : కరోనా మహమ్మారి గుబులు రేపుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమ్ ఇండియాకు పెద్ద షాక్ తగిలింది. రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడ్డారు. అందుకే అతడు ఇంగ్లాండ్ వెళ్లలేదని సమాచారం. టెస్ట్ మ్యాచ్ ఆరంభమయ్యేలోగా అతడు కోలుకుంటాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

Ashwin england departure delayed after testing covid 19 positive
అశ్విన్ దూరం..
ఇంకొద్దిరోజుల్లో భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్ఠాత్మక సిరీస్ ఆరంభం కాబోతోంది. ఓ టెస్ట్ సహా మొత్తం ఏడు మ్యాచ్‌లల్లో ఆడనుంది. జులై 1వ తేదీన తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమౌతుంది. లీసెస్టర్‌షైర్‌లో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇది రీషెడ్యూల్డ్ మ్యాచ్.
గతంలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కరోనా వైరస్ వల్ల వాయిదా పడిన అయిదో టెస్ట్ మ్యాచ్ ఇది. ఇప్పుడు మళ్లీ ఈ మ్యాచ్‌ను ఆడనున్నాయి ఈ రెండుజట్లు. దీని తరువాత మూడు టీ20లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌లో తలపడనున్నాయి. తొలి టీ20 మ్యాచ్ వచ్చేనెల 7వ తేదీన షెడ్యూల్ అయింది. ఏజెస్ బౌల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 9, 10వ తేదీల్లో ఎడ్జ్‌బాస్టన్, ట్రెంట్ బ్రిడ్జ్‌ల్లో మిగిలిన రెండు టీ20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి. అనంతరం రెండు వన్డే మ్యాచ్‌లు ఉంటాయి.
అయితే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహించగా.. పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. దీనితో అతను క్వారంటైన్‌లో వెళ్లాడు. కనీసం రెండు వారాలపాటు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంది. ఫలితంగా ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు లేనట్టే.
కాగా మిగిలిన జట్టు సభ్యులందరూ ఇప్పటికే లీసెస్టర్‌షైర్ చేరుకున్నారు. ప్రాక్టీస్ మొదలు పెట్టారు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేల పర్యవేక్షణలో ప్రాక్టీస్ సాగుతోంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సోమవారం లండన్‌కు బయలుదేరి వెళ్లాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఉన్నందున ద్రావిడ్ జట్టుతో పాటు ఇంగ్లాండ్ వెళ్లలేదు.