KCR: కేసీఆర్ మా పెద్దన్న : కేజ్రీవాల్
NQ Staff - January 19, 2023 / 09:38 AM IST

KCR : బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఇంకా పలువురు జాతీయ స్థాయి నాయకులు పాల్గొన్నారు.
బహిరంగ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ని పెద్దన్నగా పేర్కొన్నాడు. తమ అందరికీ కేసీఆర్ పెద్దన్న అన్నట్లుగా కేజ్రీవాల్ సంబోధించారు. కంటి వైద్య పరీక్షలు ఉచితంగా అందించడం గొప్ప విషయం అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
తెలంగాణలో అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ఢిల్లీలో అమలు చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. మేము ఒకరినొకరం చూస్తూ… ఒకరినొకరం ఫాలో అవుతున్నామని పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా దేశం ఇంకా వెనకబడే ఉందని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
మోడీ పాలనలో గవర్నర్లను ఆడిస్తున్నాడు, సీఎంలను ఇబ్బంది పెడుతున్నాడు. వచ్చే ఎన్నికల దేశాన్ని మార్చేందుకు ప్రజలు మాకు అవకాశం ఇవ్వాలని.. ఇదే ప్రజలకు మంచి అవకాశం అని కేజ్రీవాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దేశం ఎటు వెళ్లి పోతుందో అనే ఆందోళన కలుగుతుందని అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం, ఉపాధి కల్పనలో ఘోరంగా విఫలమైందని పేర్కొన్నాడు.
ప్రజలు మంచి కార్యక్రమాలు ఎక్కడ నుంచైనా నేర్చుకోవచ్చు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను పంజాబ్ లోనూ చేపడతామని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తుందని దేశం మొత్తం కూడా ఇదే విధంగా దూసుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.