AP-TS: రెండు తెలుగు రాష్ట్రాల.. ఇంట్రస్టింగ్ అప్డేట్స్..
Kondala Rao - May 13, 2021 / 07:14 PM IST

AP-TS: రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇవాళ గురువారం రెండు ముఖ్యమైన అప్డేట్స్ చోటుచేసుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించబోమని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తేల్చిచెప్పింది. పరిస్థితులు కుదుటపడ్డాకే జరపుతామని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఏపీలో మూడు స్థానాలు ఈ నెలాఖరున, తెలంగాణలో ఆరు సీట్లు జూన్ మూడో తేదీన ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు సీఈసీకి రీసెంటుగా లెటర్ రాసింది. ఈ లేఖపై లోతుగా చర్చించిన సీఈసీ తన స్పందనని ఇవాళ తెలిపింది. దీంతో ఆశావహులు చల్లబడనున్నారు. అధికార పార్టీల అధినేతలు కాస్త ఊపిరి పీల్చుకోనున్నారు. ఇటీవల నాలుగు రాష్ట్రాలతోపాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతం(పుదుచ్చెరి)లో అసెంబ్లీ ఎన్నికలను పెట్టడం వల్లే కొవిడ్ పాజిటివ్ కేసులు ఈ స్థాయిలో పెరిగాయనే విమర్శలు రావటంతో ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయంలో సీఈసీ వెనకడుగు వేసిందని విశ్లేషకులు అంటున్నారు.
రంజాన్ శుభాకాంక్షలు..
రేపు శుక్రవారం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపవాస దీక్షలతో ఈ పవిత్ర మాసం శాంతి, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను మానవాళికి పంచుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గంగా జమున తహజీబ్ కి రంజాన్ పర్వదినం చెరగని గుర్తు అని తెలిపారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం తమ సర్కారు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు వాళ్ల జీవితాల్లో వెలుగులను నింపుతున్నాయని చెప్పారు. ఈ మేరకు చెప్పుకోదగ్గ ఫలితాలు కూడా వస్తున్నాయని కేసీఆర్ అన్నారు.
అల్లా దీవెనలతో..
అల్లా చల్లని చూపులతో ప్రపంచానికి మంచి జరగాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రజలు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడాలని, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని పేర్కొన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక ఆలోచనలు, ఆచరణల కలయికే రంజాన్ ఫెస్టివల్ అని తెలిపారు. అల్లా రక్షణ, కరుణ పొందాలనే ఆశతోనే ముస్లిం సోదరులు రంజాన్ నెలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని జగన్ చెప్పారు.