మరోసారి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు.. ఈసారి కూడా ఎన్నికల కమిషన్ విషయంలోనే?
Ajay G - October 27, 2020 / 09:02 PM IST

ఏపీలో న్యాయవ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య పెద్ద పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థపై ఏపీ సీఎం జగన్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మరోవైపు ఏపీ ఎన్నికల కమిషనర్.. ఏపీ ప్రభుత్వం తీరుపై కోర్టుకెక్కారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వం.. తమతో సహకరించడం లేదంటూ ఏపీ సీఈసీ నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ap high court questions ap govt over election commission issue
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ కు సహకరించాల్సిందేనంటూ వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించింది. తాజాగా మరోసారి హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.
ఎన్నికల అధికారి వచ్చి మిమ్మల్ని అడిగితే కానీ.. మీరు ఎన్నికలకు సహకరించరా? మీకు బాధ్యత లేదా? అంటూ కోర్టు మొట్టికాయలు వేసింది. సీఈసీ దాఖలు చేసిన పిటిషన్ కు అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కోర్టు ప్రభుత్వానికి సూచించింది.
ఒక రాజ్యాంగ సంస్థ ప్రభుత్వం దగ్గరికి వచ్చి అడగాలా? అని ప్రభుత్వం తరుపు లాయర్ వ్యాఖ్యలను కోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వమే ఈసీ దగ్గరికి వెళ్లాలని.. ఈసీనే ప్రభుత్వాన్ని అభ్యర్థించాలనడం కరెక్ట్ కాదని కోర్టు తెలిపింది.