AP: చదువుల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం

AP: ఆంధ్రప్రదేశ్ లో ఇకపై అంగన్ వాడీలు కనపడవేమో. ఎందుకంటే వాటిని ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న స్కూళ్లలో అంగన్ వాడీలను కలిపేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఇవాళ గురువారం విద్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల మధ్య సమన్వయంపై దిశానిర్దేశం చేశారు. పిల్లల చదువులకి, పౌష్టికాహారానికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పూర్వ ప్రాథమిక పాఠశాలలు కిలో మీటర్ దూరం లోపు, మిగతా స్కూళ్లు 3 కిలో మీటర్ల దూరంలో ఉండాలని చెప్పారు.

AP

బ్లాక్ టు గ్రీన్.. గ్రీన్ టు డిజిటల్..

గతంలో గవర్నమెంట్ స్కూల్స్ లో బ్లాక్ బోర్డులను వాడేవాళ్లు. బ్లాక్ నుంచి ఇప్పుడు గ్రీన్ బోర్డులకు వచ్చాం. రానున్న రోజుల్లో గ్రీన్ నుంచి డిజిటల్ బోర్డులకు వెళ్లే పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. స్థానిక ప్రాథమిక పాఠశాలల్లో అంగన్ వాడీలు అంటే ప్రైమరీ-1, ప్రైమరీ-2లతోపాటు ఒకటో, రెండో తరగతి ఫౌండేషన్ స్కూళ్ల ఏర్పాటు తర్వాత డిజిటల్ బోధన ప్రక్రియపై ఫోకస్ పెట్టాలని సూచించారు. వీటిని అమలుచేయాల్సిన పక్షంలో 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత పాఠశాలలకు బదిలీ చేయాల్సి ఉంటుందేమో చూడాలని చెప్పారు. చిన్నారుల్లో ఆరేళ్ల వయసులోపే 80 శాతం మైండ్ మెచ్యూరిటీ జరుగుతుంది. అందుకే ప్రిప్రైమరీ స్టూడెంట్స్ కి అత్యుత్తమ విద్యను అందించాలనేదే తమ తపన, తమ ఆరాటం అని సీఎం చెప్పారు.

AP

స్కూళ్లా?.. కాలేజీలా?..

‘‘11, 12 తరగతులను ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లలో పెట్టడమా? లేక మండలానికి ఒక జూనియర్ కాలేజీ పెట్టడమా? అనేది ఆలోచించండి. అవసరమైతే మండలానికి రెండు జూనియర్ కాలేజీలు కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుందేమో పూర్తి స్థాయిలో పరిశీలించండి. తదుపరి సమీక్షా సమావేశంలో తుది నిర్ణయం తీసుకుందాం. దీనివల్ల ప్రభుత్వ రంగంలోనే మంచి విద్య అందించే ఛాన్స్ ఉంటుంది’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు.