AP Govt: బ్రేకింగ్ న్యూస్ : జగన్ సర్కారు కీలక నిర్ణయాలు

AP Govt: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కార్ ఇవాళ శుక్రవారం సాయంత్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే నెల ఒకటి నుంచి 18 సంవత్సరాల వయసు నిండే ప్రతిఒక్కరికీ ఉచితంగా కొవిడ్-19 టీకా వేయనున్నట్లు ప్రకటించింది. అలాగే.. రేపు శనివారం రాత్రి నుంచి కర్ఫ్యూ పెట్టనున్నట్లు తెలిపింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ ఆజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొంది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని, ఈ మహమ్మారి నియంత్రణకు వ్యాక్సిన్ ఎంతో ముఖ్యమని అభిప్రాయపడింది. కళ్యాణ మండపాలను కొవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని నిర్ణయించారు. బెడ్ల సంఖ్య పెంచనున్నారు. నర్సులు, డాక్టర్ల రిక్రూట్మెంట్ చేపట్టనున్నారు.

రూ.1,600 కోట్లు..

ఏపీలో 18 ఏళ్లు నిండినవారి సంఖ్య 2 కోట్ల 4 లక్షల 70 వేల 364. వీళ్లందరికీ కొవిడ్-19 టీకాని ఉచితంగా అందించాలంటే రూ.1,600 కోట్లు ఖర్చు అవుతాయని వైఎస్సార్సీపీ గవర్నమెంట్ ఒక అంచనాకి వచ్చింది. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఇవాళ పలువురు మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయిలో సమావేశమై కరోనా కట్టడిపై లోతుగా చర్చించారు. ఆ వివరాలను మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ‘‘కరోనా నివారణకి ఏపీ సర్కారు మొదటి నుంచీ ప్రధాన్యం ఇస్తోంది. పరీక్షల కోసం సీటీ స్కాన్ సెంటర్లకు వెళ్లే కరోనా బాధితుల నుంచి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో వాటిని కంట్రోల్ చేశాం. గవర్నమెంట్ రేట్ (రూ.2,500) కన్నా ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రైవేట్ హాస్పిటల్స్ కీ ఇది వర్తిస్తుంది’’ అని నానీ హెచ్చరించారు.

ఎండీలకు జగన్ ఫోన్..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు భారత్ బయోటెక్, హెటెరో డ్రగ్స్ కంపెనీల ఎండీలతో మాట్లాడారు. భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణా ఎల్లా, హెటెరో డ్రగ్స్‌ ఎండీ పార్థసారథికి సీఎం ఫోన్ చేశారు. వ్యాక్సిన్ సరఫరా విషయమై వారితో చర్చించారు. తమకు కరోనా టీకా అదనపు డోసులు, రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు.

Advertisement