హై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం
Admin - August 8, 2020 / 09:39 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని మార్పు అనే అంశం రోజుకో మలుపు తిరుగుతుంది. వికేంద్రీకరణ, సీఆర్డిఎఫ్ బిల్లులను ఈనెల 14వరకు నిలిపివేస్తూ హై కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడంపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోని జగన్, ఇప్పుడు న్యాయవ్యవస్థను కూడా లెక్కచేయడం లేదని వ్యాఖ్యానించారు.
రాజధాని విషయంలో తాము కల్పించుకోలేమని కేంద్రం కూడా చెప్పడంతో అమరావతి రైతులు ఇప్పుడు తమ ఉద్యమాన్ని ఉధృతి చేస్తున్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ ఇప్పుడు ఇలా మాట మార్చడం తగదని రైతులు తెలిపారు. రాజధానిని ఇక్కడి నుండే తరలిస్తే తామంతా సామూహికంగా ఆత్మహత్యలు చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రైతులను కుక్కలతో పోల్చిన వైసీపీ నాయకులపై ఇప్పటివరకు జగన్ చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.