ఏపీలో అక్టోబర్ 15 నుండి కళాశాలలు ప్రారంభం
Admin - August 6, 2020 / 02:02 PM IST

అమరావతి: కరోనాతో రాష్ట్రంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్న తరుణంలో అక్టోబర్ 15 నుండి రాష్ట్రంలో కళాశాలలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత విద్యపై ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ నెలలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి కావలసిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్‌ను 90శాతానికి తీసుకెళ్లాలని, మూడేళ్ల, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో 10 నెలల అప్రెంటిస్‌షిప్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆపై మరో ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కోర్సులు బోధన జరగాలన్నారు.
కరోనా కేసులో రాష్ట్రంలో పెరుగుతున్న తరుణంలో జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రజల్లో భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. చదువు కంటే ప్రాణాలు ముఖ్యమని, కరోనా నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా కళాశాలలు ప్రారంభిస్తే యువతను ప్రమాదంలోకి నెట్టినవారిమవుతామని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.