Pig Kidney To Human: వైద్య‌శాస్త్రంలో మ‌రో అద్భుతం..మ‌నిషికి పంది కిడ్నీ..!

Pig Kidney To Human: వైద్య‌శాస్త్రంలో అనేక అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. జ‌న్యు మార్పిడీలు చేస్తూ వండ‌ర్స్ క్రియేట్ చేస్తున్నారు.తాజాగా జంతువు అవయవాన్ని మనిషికి అమర్చి అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త చరిత్రను లిఖించారు. పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు. సెప్టెంబరు 25న న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోన్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు ఈ శస్త్రచికిత్సను నిర్వహించారు.

వైద్యరంగాన్ని తీవ్రంగా వేధిస్తున్న అవయవాల కొరతను అధిగమించే దిశగా కీలక ముందడుగు పడింది. శాస్త్రవేత్తల దశాబ్దాల పరిశోధనలు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ రోజుల్లో.. అవయవాల కొరత మరింత పెరిగిన నేప‌థ్యంలో దీన్ని అధిగమించే దిశగా.. పందుల అవయవాలను మనుషులకు అమర్చే అవకాశాలపై ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి.

రెండు గంటలకుపైగా శ్రమించి మనిషికి అమర్చిన ఈ కిడ్నీ సాధారణంగానే పనిచేయడం విశేషం. బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తికి తాత్కాలికంగా పంది కిడ్నీని అమర్చి, ప్రయోగం నిర్వహించారు. మూడు రోజులపాటు దాని పనితీరును పరిశీలించారు. ఈ కిడ్నీ సాధారణంగానే పనిచేసిందని, రోగనిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదని శస్త్రచికిత్సకు నేతృత్వం వహించిన డాక్టర్ రాబర్డ్‌ మాంట్‌గోమరి తెలిపారు.

పంది కణాల్లోని గ్లూకోజ్‌ మనిషి శరీర వ్యవస్థకు సరిపోలదు. దీంతో మానవ రోగనిరోధక వ్యవస్థ ఈ అవయవాలను తిరస్కరిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్‌వైయూ శాస్త్రవేత్తలు… జన్యుపరమైన మార్పులు చేసిన పంది నుంచి అవయవాన్ని సేకరించారు.

రోగి ఒక కాలు పైభాగంలో ఉన్న రక్త నాళాలకు కిడ్నీని అనుసంధానం చేశారు.. తద్వారా బయాప్సీ నమూనాలను సేకరించారు. అవయవదాత అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా పంది కిడ్నీని అమర్చడానికి అతడి కుటుంబసభ్యులు అంగీకరించారు. శస్త్రచికిత్స తర్వాత ఐసీయూలో 54 గంటల పరిశీలించగా, ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదని గుర్తించారు.

నిజానికి ఈ తరహా ప్రయోగాలు 17 శతాబ్దం నుంచే జరుగుతున్నాయి. 20వ శతాబ్దంలో.. మరణం ఖాయమైన ఓ పసికందుకు కొండముచ్చు గుండెను అమర్చి 21 రోజుల పాటు బతికించడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. దీంతో.. నాటి నుంచి ఊపందుకున్న ఈ ప్రయోగం.. తాజా విజయంతో మరో స్థాయికి చేరినట్లయింది.