Anasuya: బుల్లితెరకు గ్లామర్ అద్ది తన అంద చందాలతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న కుందనపు బొమ్మ అనసూయ భరద్వాజ్. ఓవైపు బుల్లితెర కార్యక్రమాలు చేస్తూ మరోవైపు ఆచితూచి సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం రమేష్ రాపర్తి దర్శకత్వంలో థ్యాంక్ యూ బ్రదర్ అనే సినిమా చేస్తుండగా అందులో అశ్విన్ విరాజ్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్, టీజర్, ట్రైలర్స్ సెలబ్రిటీలతో విడుదల చేయిస్తూ మూవీకి మంచి ప్రమోషన్ దక్కేలా చేస్తున్నారు.
సినిమా ఫస్ట్ లుక్‌ను సాయి తేజ్ విడుదల చేయగా, ఇందులో అనసూయ భరద్వాజ్ ప్రెగ్నెంట్ లుక్‌లో, చేతిలో ఫేస్ మాస్క్ పట్టుకొని కోపంగా చూస్తున్నట్లు కనిపిస్తుంటే, ఆమె వెనకే మరో ప్రధాన పాత్రధారి అశ్విన్ విరాజ్ సీరియస్ లుక్‌లో నిలబడి ఉన్నాడు. ఈ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంది.ఇక మోషన్ పోస్టర్‌ను మహేష్ బాబు రిలీజ్ చేశారు. ఇందులో వీరిద్దరు సీరియస్ లుక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఇక తాజాగా ట్రైలర్‌ని విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూశాక అనసూయలో ఉన్న ఒరిజినల్ నటి బయటకు వచ్చిందని అనిపిస్తుంది. గర్భవతిగా అనసూయ అదరగొట్టింది. అనసూయకు నొప్పులు వచ్చిన సయంలో ఆమెతో ఓ కుర్రాడు లిఫ్ట్‌లో ఇరుక్కుపోగా, అప్పుడు ఆ కుర్రాడు అనసూయను ఎలా కాపాడుతాడు అనేది సినిమాలో చూపించనున్నట్టు ట్రైలర్ ని బట్టి అర్ధమవుతుంది.
మనసుకు హత్తుకునేలా ఉన్న ఈ ట్రైలర్ కచ్చితంగా సినిమాపై అంచనాలు పెంచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అనసూయ ఇప్పుడు గర్భవతిగా నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రమేష్ రాపర్తి చెప్పిన వెంటనే కథకు బాగా కనెక్ట్ అయిపోయాను అని చెప్పింది అనసూయ. రీల్ లైఫ్‌లో కాదు.. రియల్ లైఫ్‌లో కూడా మరోసారి గర్భం దాల్చడానికి తనకేం అభ్యంతరం లేదని అప్పట్లో సంచలన కామెంట్స్ చేసింది అనసూయ. సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, గుణ బాలసుబ్రమణియన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. మరి కొద్దిరోజులలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.