BJP : బీజేపీ మేనిఫెస్టో ఇంత ఆలస్యమా.. అభ్యర్థులకు అతిపెద్ద మైనస్..!
NQ Staff - November 14, 2023 / 11:12 AM IST

BJP :
ఆలస్యం అమృతం విషం అనే సామెత ఊరికే పుట్టలేదు. ఏదైనా సరే ఆలస్యం జరిగింది అంటే దానికి అందే ఫలితం అందకపోగా.. అది విషంగా మారే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ చేస్తున్న ఆలస్యం కూడా ఇలాగే ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ అన్ని విషయాల్లో ఆలస్యం చేస్తూనే ఉంది ఆ పార్టీ. ముఖ్యంగా పార్టీ అభ్యర్తులను ప్రకటించడంలో అన్ని పార్టీల కంటే వెనకబడి ఉంది. నామినేషన్స్ కు చివరి నిముషంలో అభ్యర్థులను ప్రకటించడం అంటే ఎంత వెనకబడి ఉందో అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి ఆ పార్టీకి అసలు ఎన్నికలపై ఏమైనా చిత్తశుద్ధి ఉందా లేదా అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అదే బీఆర్ ఎస్ పార్టీని చూసుకుంటే ఆగస్టులోనే అభ్యర్థులను ప్రటించింది. కేసీఆర్ లిస్టును ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా పార్టీకి రాజీనామాలు చేయలేదు. అంతే కాదు ఎవరూ కూడా కేసీఆర్ ను విమర్శిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు చేయలేదు. కానీ బీజేపీలో మాత్రం వరుసగా రాజీనామాలు, ధర్నాలు చేస్తున్నారు. నామినేషన్స్ వేస్తూ రెబల్స్ గా మారుతున్నారు. ఇలా ఆలస్యం చేయడం వల్ల అందరూ ఆశలు పెట్టుకుని రెబల్స్ గా మారుతున్నారు. ఇది ఆ పార్టీకి అతిపెద్ద మైనస్ గా మారిందనే చెప్పుకోవాలి. ఇక ఇప్పుడేమో మేనిఫెస్టో విషయంలో ఆలస్యం చేస్తున్నారు.
అసలు ప్రజల్లో ఎప్పుడు ప్రచారం చేసుకోవాలి అనేది కూడా వారు పట్టించుకుంటున్నట్టు కనిపించట్లేదు. అభ్యర్థులు ఏమని ప్రచారం చేసు కోవాలి అనేది అధిష్టానం ఆలోచించట్లేదు. ఈ నెల 17న అమిత్ షా చేతుల మీదుగా మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెబుతున్నారు. ఎన్నికలకు పది రోజుల ముందు మేనిఫెస్టోను ప్రకటించడం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. ఆ పది రోజుల్లో ఎంత ప్రచారం చేసినా ప్రజలందరికీ మేనిఫెస్టో చేరుతుందనే నమ్మకం లేదు. మరి ఆ విషయాన్ని అధిష్టానం ఎందుకు మర్చిపోయినట్టు. ఇదే మేనిఫెస్టోను బీఆర్ ఎస్ గత నెలలోనే విడుదల చేసింది.
అప్పటి నుంచే బీఆర్ ఎస్ అభ్యర్థులు దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. అటు కాంగ్రెస్ కూడా అందరికంటే ముందే మేనిఫెస్టోను ప్రకటించింది. ఆ పార్టీ అభ్యర్థులు కూడా ప్రచారాన్ని బలంగా చేసుకుంటున్నారు. ఎటొచ్చి బీజేపీ అభ్యర్థులు మొన్నటి వరకు తేలలేదు. ఇక కింద మీద పడి వారిని ప్రకటించినా ప్రచారం చేసుకోవడానికి మేనిఫెస్టో లేదు.
ఏం చేస్తామో, ఏది చూపించి ఓట్లు అడగాలో అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. మిగిలిన పది రోజుల్లో ఏం ప్రచారం చేస్తారు.. ఎలా నెట్టుకొస్తారు. పైగా ఈ సారి చాలా నియోజకవర్గాల్లో కొత్త ముఖాలను దింపింది బీజేపీ పార్టీ. మరి వారు ఎప్పుడు ప్రచారం చేసుకుంటారు.. ఎలా గెలుస్తారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.