PM Modi: మోడీ మెడలో గంట కట్టేదెవరు?..

PM Modi ఎదుటివాడు మనల్ని మొదటిసారి మోసం చేస్తే అది వాడి తప్పు. రెండోసారి మోసం చేస్తే అది మన తప్పు. ఎందుకంటే తొలిసారి మోసం చేసినప్పుడు మనం రెండోసారైనా జాగ్రత్తగా ఉండాలి కదా. అప్పుడూ ఏమరుపాటుగానే ఉండటం మన పొరపాటే. ఇదే సూత్రం మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కరెక్టుగా సరిపోతుంది. కొవిడ్-19 వైరస్ ఫస్ట్ వేవ్ లో అనుకోకుండా, ఒక్కసారిగా విరుచుకుపడింది. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టలేకపోయాయి. ఈ వాదనలో లాజిక్ ఉంది. నిజమూ ఉంది. కానీ.. ఏడాది తర్వాత కూడా సెకండ్ వేవ్ ఇంత ప్రమాదకరంగా పరిణమించిందంటే అది కచ్చితంగా సర్కార్ల తప్పిదమే. మరీ ముఖ్యంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల పైన అజమాయిషీ కలిగిన సెంట్రల్ గవర్నమెంట్ వైవే అన్ని వేళ్లూ లేస్తాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీకి స్వపక్షమైన ఆరెస్సెస్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వైఫల్యాన్నే పట్టిచూపుతోంది.

బీజేపీకి ఢిల్లీ శాఖ లేదా?..

బీజేపీకి సైద్ధాంతిక మార్గదర్శి ఆరెస్సెస్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రధాని మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా సహా చాలా మంది బీజేపీ నాయకులు కూడా ఆ సంస్థ నుంచి వచ్చినవాళ్లే. అదే ఆరెస్సెస్ ప్రస్తుతం మోడీ పనితీరుపై ముఖ్యంగా కొవిడ్-19 వైరస్ ని కంట్రోల్ చేయలేకపోవటంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. విమర్శించటానికి ఇది సమయం కాదు కాబట్టి ఆరెస్సెస్ కేంద్ర కార్యవర్గం ఈ విషయాన్ని బయటికి చెప్పలేకపోతున్నా ఆ సంస్థ ఢిల్లీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజీవ్ తుల్లి మాత్రం ఉండబట్టలేకపోయాడు. మొన్న బుధవారం ఓపెన్ గానే కమలనాథులపై విరుచుకుపడ్డాడు. ఢిల్లీలో అసలు బీజేపీకి రాష్ట్ర శాఖ ఉందా?. ఉంటే కరోనా నియంత్రణ చర్యల్లో ఎక్కడా కనిపించట్లేదేంటి? అని ప్రశ్నించారు. కొవిడ్ విలయంతో ఢిల్లీ అతలాకుతలం అవుతుంటే జనాన్ని ఆదుకోవటానికి ఒక్క బీజేపీ లీడరైనా బయటికి రావట్లేదేంటి? అని నిలదీశారు. ఢిల్లీవాసులకు అండగా నిలవాల్సిన తీరు ఇదేనా అని కుండబద్ధలు కొట్టారు.

వ్యక్తిగతం ఎలా అవుతుంది?..

రాజీవ్ తుల్లి వ్యాఖ్యలను ఆరెస్సెస్ అఖిల్ భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేద్కర్ ఖండించారు. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని చెప్పారు. ఆరెస్సెస్ ఢిల్లీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాట్లాడిన మాటలు పర్సనల్ ఎలా అవుతాయి? అని పబ్లిక్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అవి నా వ్యక్తిగత వ్యాఖ్యలు అని ఆయన చెప్పకుండా సునీల్ చెబితే ఎలా అంటున్నారు. దీన్నిబట్టి కేంద్రంలో అధికారంలో, పదవుల్లో ఉన్న బీజేపీ నేతలు కరోనా వైరస్ వ్యాప్తిని లైట్ గా తీసుకోవటం పట్ల ఆరెస్సెస్ కలత చెందుతోందని అర్థంచేసుకోవచ్చు. పైకి ఒప్పుకోలేకపోయినా ఆరెస్సెస్ ముఖ్యులు కూడా ఇదే అనుకుంటున్నట్లు సమాచారం. కాకపోతే ప్రధాని మోడీ మెడలో గంట కట్టేవారే కనిపించట్లేదు.

Advertisement