Acham Naidu: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. కోర్టులో హాజరైన తర్వాత ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే పోలీసులు అచ్చెన్న ను శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు లోని జిల్లా జైలుకు తరలించారు. అలాగే ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 8775 ను కేటాయించారు. దీనితో అచ్చెన్నాయుడు తొలిసారిగా ఖైదీ దుస్తులు వేసుకోవాల్సి వచ్చింది.

వందల కోట్ల ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టు అయినప్పుడు కూడా అచ్చెన్న జైల్లో ఎక్కువసేపు ఉండలేదు కానీ ఈ సారి మాత్రం ఆయన ఎక్కువ రోజులు జైల్లో గడపాల్సి వస్తోంది. ఐతే మంగళవారం రోజు సాయంత్రం తర్వాత జైలుకు చేరుకున్న అచ్చెన్నాయుడు చిక్కుడుకాయ కూర తో మూడు చపాతీలు తిని రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో నిద్ర పోయారు. బుధవారం రోజు ఉదయం పూట ఐదున్నర గంటలకే నిద్ర లేచిన ఆయన టీ తాగి జైలు సిబ్బంది తీసుకొచ్చిన సాక్షి, మరో పత్రిక చదివారు. అనంతరం ఎనిమిదిన్నర గంటల సమయంలో అల్పాహారంగా పొంగలి తిన్నారు. ఆ తర్వాత తాను రిమాండ్ ఖైదీగా వచ్చినప్పుడు ధరించిన డ్రస్ ను విడిచి ఖైదీ డ్రెస్ ధరించారు.
అయితే జైల్లో ఉన్న అచ్చెన్నాయుడు తాను ఎవరినీ కలవనని జైలు సిబ్బంది తో చెప్పారట. కానీ గురు, శుక్ర వారాల్లో నారా లోకేష్, చంద్రబాబు నాయుడు జైలుకు వచ్చి అచ్చెన్నాయుడిని కలిసే అవకాశం ఉందని సమాచారం. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర వివాదం నెలకొంటున్నాయి. అయితే తొలి విడత నామినేషన్ లో జరిగిన వివాదం విషయంలో 22 మందిపై కోటబొమ్మాలి లో కేసు నమోదు అయ్యింది. వారిలో ఒకరిగా అచ్చెన్నాయుడు కూడా ఉండటంతో ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించారు పోలీసులు. అయితే పోలీసులు తప్పుడు కేసులు పెట్టి తనను అన్యాయంగా అరెస్టు చేశారని అచ్చెన్నాయుడు ఆరోపిస్తున్నారు.