Hyderabad : హైద్రాబాద్‌లో నడిరోడ్డుపై మహిళ ప్రసవం.! వెల్లివిరిసిన మానవత్వం.!
NQ Staff - December 25, 2022 / 10:17 AM IST

Hyderabad : హైద్రాబాద్ మహానగరంలో ఓ మహిళ నడి రోడ్డుపై ప్రసవించింది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రకు చెందిన బబిత అనే గర్భిణీ, ఇస్నాపూర్‌లో నివాసం వుంటోంది. శనివారం మధ్యానం నడుచుకుంటూ వెళుతుండగా అకస్మాత్తుగా ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి.
పురిటినొప్పులతోనే రామచంద్రాపురం అశోక్ నగర్ కూడలి వద్ద రోదిస్తూ రోడ్డుపైన కుప్పకూలిపోయిందామె. ఊహించని ఈ ఘటనతో షాక్‌కి గురైన స్థానికులు వెంటనే తేరుకుని, సమీపంలో వున్న దుకాణాల నుంచి అట్టముక్కలు తీసుకొచ్చి అడ్డంగా పెట్టారు.
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన వైనం..
గర్భిణి బబిత ప్రసవ వేదనతో విలవిల్లాడింది.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే ఆమెను ఆటోలో పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి స్థానికులు తరలించారు. అక్కడ ఆమెకు వైద్యులు వైద్య చికిత్స అందించారు.
కాగా, బాధితురాలి దయనీయ స్థితికి చలించిపోయిన ఓ వ్యక్తి ఆమెకు కొంత మేర ఆర్థిక సాయం చేసినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా సమయానికి అంబులెన్స్ ఎందుకు అక్కడికి చేరుకోలేదు.? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహానగరంలో ఇలాంటి పరిస్థితి రావడంపై అంతా విస్తుపోతున్నారు.