Magawa: ఇదెక్క‌డి విచిత్రం.. ఎలుక‌కు గోల్డ్ మెడ‌లా?

Magawa ప్రపంచంలో కొన్ని వార్తలు వింటే అస్సలు నమ్మలేం. ఎందుకంటే అవి అంచనాలకు అందకుండా ఉంటాయి మరి. తాజాగా ఓ ఎలుక గోల్డ్‌ మెడల్‌ సాధించి అందరినీ ఆశ్యర్యచ‌కితుల్ని చేసింది. గోల్డ్‌మెడల్ అనంతరం ఆ ఎలుకకు రిటైర్మెంట్‌ ఇచ్చారు. ఇక వివరాలు చూస్తే.. బెల్జియంకి చెందిన చారిటీ సంస్థ అపోపో.. ఎలుకకు ట్రైనింగ్ ఇచ్చింది. ఈ సంస్థకు టాంజానియాలో కార్యాలయం ఉంది. ఈ సంస్థ 1990 నుంచి హీరో ర్యాట్స్‌ని పెంచుతూ.. వాటికి మందుపాతర్లను ఎలా వెతకాలో ట్రైనింగ్ ఇస్తోంది. సంవత్సరం పాటూ ట్రైనింగ్ ఇచ్చాక సర్టిఫికెట్ ఇస్తోంది. ఈ ఎలుకలు.. మందుపాతర్లలోని రసాయనిక పదార్థాలను వాసన చూసి పసిగడతాయి. అంటే.. వీటికి మందుపాతర్ల లోపల ఏముందో వాసన చూడగలిగేంత శక్తి ఉందన్న మాట. అవి చురుకుగా పనిచేయడమే కాకుండా ఆపత్కాలంలో ఉన్న ప్రజలను ఇట్టే కాపాడగలవు.

గోల్డ్‌ మెడల్‌ సాధించిన మగావా అనే ఎలుక సామాన్యమైనది కాదు. ఎలుకల్లో ఓ విధంగా అది హీరో పాత్ర పోషించింది. మగావా మందు పాతర్లను కనిపెట్టే ఉద్యోగం చేసింది. తన డ్యూటీలో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు గానూ.. గోల్డ్‌ మెడల్‌ సాధించింది. గత 77 ఏళ్లలో ఓ ఎలుకకు గోల్డ్‌మెడల్‌ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఈ ఎలుక ఆఫ్రికాకు చెందిన భారీ పౌచ్‌ ర్యాట్‌. మగావా గత ఐదేళ్లుగా విధులు నిర్వహిస్తోంది. తన సర్వీసులో అది 71 మందు పాతర్లను కనిపెట్టి, చాలా మంది జీవితాలను కాపాడిందట.

మగావా రిటైర్మెంట్ అనంతరం.. గతవారం అపోపో సంస్థ సరికొత్త కుర్ర ఎలుకల్ని కాంబోడియా మైన్ యాక్షన్‌ సెంటర్‌కి పంపింది. అవన్నీ.. డ్యూటీలోకి ఎంటరయ్యాయి. ఇక ఇవి ఎక్కడెక్కడ మందుపాతర్లు ఉన్నాయో వెతకడం ప్రారంభిస్తాయి. ఐతే.. మగావా మరికొన్ని వారాలు.. CMAC దగ్గరే ఉంటుంది. కొత్తగా వచ్చిన ఎలుకలకు అది అక్కడి వాస్తవ పరిస్థితులను చెబుతుంది. వాటికి రియల్ ట్రైనింగ్ ఇస్తుంది.

బంగారు పతకం సాధించిన మగావాకు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ ఎలుక వల్ల చాలా మంది మందుపాతర్లకు బలి అవ్వకుండా ప్రాణాలు దక్కించుకున్నారు. దాని బరువు 1.2 కేజీలు. ఎత్తు 28 అంగుళాలు. ఇతర ఎలుకల కంటే ఇది పెద్దదే. ఐతే.. ఈ ఎలుక మందు పాతర్లపైనుంచి వెళ్లినా దీనికి ఏమీ కాదు. ఎందుకంటే.. అవి పేలాలంటే.. ఈ బరువు సరిపోదు. అందువల్ల ఇది టెన్నిస్ కోర్ట్ అంత ప్రాంతాన్ని జస్ట్ 20 నిమిషాల్లో సెర్చ్ చెయ్యగలదు. అదే డిటెక్టర్స్‌తో సెర్చ్ చెయ్యాలంటే.. ఒక రోజు నుంచి 4 రోజులు పడుతుందని అపోపో సంస్థ వాస్తవ పరిస్థితులను వెల్లడించింది.