Mobile Crematorium : ఇంటి వద్దే దహన సంస్కారాలు చేస్తున్న మొబైల్ శ్మశాన వాటిక.. రెండు గంటల్లోనే..!
NQ Staff - January 18, 2023 / 12:42 PM IST

Mobile Crematorium : ఇప్పుడు భూమి కొరత అనేది ఎక్కువగా అవుతోంది. ఎందుకంటే రాను రాను మనుషులు పెరిగిపోతున్నారు. భూమి తగ్గిపోతోంది. విపరీత పోకడల నడుమ అనేక సమస్యలు వస్తున్నాయి. చిన్న గ్రామంలో కూడా అపార్టుమెంట్లు కట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాలు పట్టణాలుగా మారిపోతున్నాయి. ఈ తరుణంలో శ్మశాన వాటిక, పార్కులు, గ్రౌండ్లు లాంటి వాటికి స్థలాలు కరువవుతున్నాయి.
హిందూ సంప్రదాయం ప్రకారం ఒక మనిషి చనిపోతే కచ్చితంగా శ్మశానంలో దహన సంస్కారాలు చేస్తుంటారు. అయితే ఓ గ్రామంలో మాత్రం మొబైల్ శ్మశాన వాటిక వెలిసింది. అంటే ఇంటి దగ్గరే దహన సంస్కారాలు చేస్తారన్న మాట. మరి గ్రామంలో అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయో తెలుసుకుందాం. కర్నాటకలోని కుందాపూర్ లో ఉంటే బైందూర్ జడ్కల్ గ్రామ పంచాయితీలో ముదుర్ అనే గ్రామం ఉంది.
ఇంటి వద్దనే అంత్యక్రియలు..
ఈ ఊరిలో దాదాపు 600 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే గతేడాది ఆ ఊరిలో వ్యక్తి మరణించాడు. కానీ దగ్గరలో ఉన్న శ్మశాన వాటిక స్థలం వివాదంలో ఉంది. కోర్టు కేసులో ఉండటంతో అక్కడ అంత్యక్రియలు చేయలేకపోయారు. దాంతో ఇంటి వద్దనే ఆ కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది. అది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది.
దీనికి పరిష్కారం చూపించాలి అనుకున్నారు ముదురు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ఎంపిఎసిఎస్) అధికారులు. ఇందులో భాగంగా కేరళలోని మొబైల్ శ్మశాన వాటిక గురించి తెలుసుకున్నారు. అక్కడ వీటిని తయారు చేస్తున్న చైర్ కంపెనీ నుంచి ఒకటి కొనుగోలు చేశారు. ఇది ఇంటి వద్దనే రెండు గంటల్లో మృతదేహాన్ని పూర్తిగా దహనం చేస్తుంది. అయితే ఆ గ్రామంలో దీంట్లో దహన సంస్కారాలు చేయడానికి ఎలాంటి నగదు వసూలు చేయట్లేదు.