కోవిడ్ వార్డ్‌లో అగ్ని ప్ర‌మాదం..52 మంది అగ్నికి ఆహుతి

ఇరాక్‌లోని కోవిడ్ వార్డ్‌లో ఘోర అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 52 మంది క‌రోనా బాధితులు చనిపోగా, 22 మంది గాయ‌ప‌డ్డారు. అయితే ఆసుప‌త్రి వార్డ్‌లో మంట‌లు, పొగ ద‌ట్టంగా అలుముకోవ‌డంతో ప్ర‌మాద తీవ్ర‌త మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.అయితే ఈ ప్ర‌మాదంలో చనిపోయినవాళ్లంతా కరోనా పేషెంట్లేనని అధికారులు ధృవీకరించారు. ఇరాక్‌ నస్రీయా నగరంలోని అల్‌ హుస్సేయిన్‌ ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డికి క్ష‌త్ర‌గాత్రుల‌ని ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశారు.

A fire broke out in Covid ward
A fire broke out in Covid ward

క‌రోనా వార్డు 70 ప‌డ‌క‌ల‌తో 3 నెల‌ల క్రితం ప్రారంభ‌మైంది. ఇందులో అంతా క‌రోనా రోగులు వైద్య సిబ్బంది ఉంటారు. ఆక్సిజన్‌ ట్యాంకర్లు పేలడంతోనే ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో ఐసోలేషన్‌ వార్డులో ఉన్న పేషెంట్లంతా మంటల్లో చిక్కుకుని హాహా కారాలు చేశారు. అయితే ప్ర‌మాదం జ‌రిగింది రాత్రి కావ‌డం వ‌ల‌న పేషెంట్స్‌తో పాటు ఒక‌రిద్ద‌రు న‌ర్సులు మాత్ర‌మే ఉన్నార‌ట‌.

ఇరాక్‌లో గత మూడునెలల్లో ఇలాంటి ఘటన రెండోది కాగా, ఏప్రిల్‌లో రాజధాని బాగ్దాద్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 82 మంది మరణించగా.. 110 మంది గాయపడ్డారు. తాజాగా న‌స్రీయా ఘ‌ట‌న త‌ర్వాత ఆసుపత్రికి ముందు భారీగా చేరిన జ‌నం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేఖంగా నినాదాలు చేశారు. ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడ‌లేని ప్ర‌భుత్వం ఎందుకంటూ నిర‌స‌న తెలియ‌జేశారు.

ఈ ఘ‌ట‌న‌పై ఇరాక్ ప్ర‌ధాన‌మంత్రి ముస్తాఫా ఆల్ కాధేమీ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మినిస్ట‌ర్స్‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కారణాల‌ను విశ్లేషించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.