Viral News : సమోసాలతో రోజుకు రూ.12లక్షలు సంపాదిస్తున్న జంట.. నెలకు ఎన్ని కోట్లంటే..?
NQ Staff - March 15, 2023 / 11:00 AM IST

Viral News : మీరు మంచి బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నారా.. అయితే మీ కోసమే ఈ స్టోరీ. మనం ఎన్నో స్టోరీల్లో.. పెద్ద పెద్ద ఉద్యోగాలను వదులుకుని వ్యాపారాల్లో సక్సెస్ అయిన వారి గురించి విన్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి జంట గురించే తెలుసుకుందాం. వారు కూడా ఐదంకెల జీతాన్ని వదులుకుని వ్యాపారం వైపు అడుగులు వేసి కోట్లు సంపాదిస్తున్నారు.
హైదరాబాద్ లోనే ఎంటెక్ చేసిన శిఖర్ బయోకాన్ లో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా ఉద్యోగం చేసేవాడు. అలాగే గురుగ్రామ్ కు చెందిన ఫార్మా కంపెనీలో బిజినెస్ డెవలప్ మెంట్ అసోసియేట్ గా పనిచేసేది నిధి. వీరిద్దరూ భార్యాభర్తలు. అయితే తమ ఉద్యోగాలతో సరిపెట్టుకోని ఈ జంట.. ఎలాగైనా బిజినెస్ ప్రారంభించాలని అనుకుంది. అందులో భాగంగానే తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
మొదట్లో నష్టాలు..
2016లో బెంగళూరులో సమోసా దుకాణాన్ని ప్రారంభించారు. పెద్ద వంటగది కోసం తమ అపార్ట్ మెంట్ ను అమ్మేసి రూ.80 లక్షలు వెచ్చించారు. బెంగుళూరులో వారు సమోసా సింగ్ అనే ప్రాంచైజీని స్థాపించారు. మొదట్లో నష్టాలతో నడిచిన ఈ వ్యాపారం.. రాను రాను లాభాల బాట పట్టింది.
అనతి కాలంలోనే వారి బిజినెస్ గురించి బెంగుళూరు మొత్తం తెలిసి పోయింది. దాంతో వారి ప్రాంచైజీలో ఒక్క నెలకు 30,000 సమోసాలను అమ్ముతున్నారు. అంటే నెలకు రూ .45 కోట్ల ఆదాయం వస్తోంది. ఇలా వారు రోజుకు రూ.12 లక్షల టర్నోవర్ చేస్తున్నారు. సమోసాలతో ఇంత సంపాదిస్తున్నారంటే ఎవరూ నమ్మరు. కానీ ఇది నిజం. వారి అలుపెరగని కృషి వారిని ఈ రోజు ఈ స్థాయిలో నిలిపింది.