Badminton : ఆట‌గాళ్ల‌పై కూడా ప‌గ‌బ‌ట్టిన క‌రోనా.. ఏకంగా ఏడుగురికి పాజిటివ్

Badminton : క‌రోనా మ‌హ‌మ్మారి చాప‌కింద నీరులా పాకుతుంది. కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. సినీ సెల‌బ్రిటీలు, క్రీడాకారులు, రాజ‌కీయ నాయ‌కులు క‌రోనా బారిన ప‌డుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. తాజాగా ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​టోర్నీ- 2022కు కోవిడ్‌ సెగ తగిలినట్టు అయ్యింది.. ఇప్పటి వరకు ఏడుగురు భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారని.. వారంతా టోర్నీనుంచి తప్పుకున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్​ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది.

7 Indian Badminton players tested covid 19
7 Indian Badminton players tested covid 19

మాజీ ప్రపంచ నంబర్ 1 ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ సహా ఏడుగురు వైరస్ బారినపడినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ (బీ.డబ్ల్యూఎఫ్) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం వీరంతా ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రంలో ఉన్నారని వివరించింది. కరోనా బారినపడ్డ వారిలో రెండు సార్లు కామన్ వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాలు సాధించిన అశ్విని పొన్నప్ప, రితికా ఠక్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ సింగ్, ఖుషీ గుప్తాలు ఉన్నారు.

మరోవైపు ఈ క్రీడాకారుల డబుల్స్ పార్ట్ నర్స్ సైతం టోర్నీ నుంచి వైదొలిగారని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది.ఆ ఏడుగురితో సన్నిహితంగా ఉన్న ఇతర ఆటగాళ్లకు, సిబ్బందికి కూడా టెస్ట్‌లు నిర్వహించే పనిలో పడిపోయారు. వైరస్ సోకిన వారికి బదులుగా వేరే వారిని తీసుకునే ప్రసక్తే లేదని. దీంతో వారి ప్రత్యర్థులను నేరుగా తదుపరి రౌండ్లకు ప్రమోట్ చేస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది.

జనవరి 11న మొదలైన ఈ ఇండియా ఓపెన్ టోర్నీలో గురువారం రెండో దశ మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఈ సమయంలోనే ఏడుగురు క్రీడాకారులకు వైరస్ సోకినట్లు తేలింది. తకుముందు సాయి ప్రణీత్ కు సైతం కరోనా పాజిటివ్ గా తేలడంతో టోర్ని నుంచి నిష్క్రమించాడు.

మరోవైపు ఇంగ్లండ్ కు చెందిన ఇద్దరు క్రీడాకారులు సైతం వైరస్ బారినపడడంతో ఇంగ్లండ్ జట్టు కూడా ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. దీంతో ఇప్పుడు ఈ టోర్నీ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాండ్మింటన్ ఇండియా అసోసియేషన్ ఏం చేయనుందనేది ఆసక్తిగా మారింది. టోర్నీని రద్దు చేస్తారా లేక అలాగే కొనసాగిస్తారా? తెలియాల్సి ఉంది.