1998 DSC: విర‌మ‌ణ వ‌య‌స్సులో కొలువు.. బిచ్చగాడికి ద‌క్కిన‌ ప్రభుత్వ ఉద్యోగం

NQ Staff - June 20, 2022 / 07:50 PM IST

1998 DSC: విర‌మ‌ణ వ‌య‌స్సులో కొలువు.. బిచ్చగాడికి ద‌క్కిన‌ ప్రభుత్వ ఉద్యోగం

1998 DSC: ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం యువత పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. కుటుంబాల‌ని వ‌దిలేసి కూడా ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం గ‌ట్టిగా కృషి చేస్తున్నారు. అయితే కొంత‌మందికి ఎంత ప్ర‌య‌త్నించిన రాక‌పోవ‌డంతో విసిగి వేసారిపోయి మ‌న‌కు రాసిపెట్టి ఉన్న‌ప్పుడే వెతుక్కుంటూ వ‌స్తుందిలే అని వేరే ప‌ని చూసుకుంటారు. ఇప్పుడు 1998 డీఎస్సీ రాసిన ఓ అభ్యర్థిని ప్ర‌భుత్వ ఉద్యోగం వెతుక్కుంట వ‌చ్చింది.

55 Year Old Man Gets DSC Govt Job After 24 Years

55 Year Old Man Gets DSC Govt Job After 24 Years

క‌ల నెర‌వేరింది..

దీనికి ఆయ‌న‌కు న‌వ్వాలో ఏడ‌వాలో కూడా తెలియడం లేదు. అందుకు కార‌ణం పదవి విరమణ వయస్సులో పాపం ఆ వ్యక్తి ప్రభుత్వం కొలువు వచ్చింది.శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్ద సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావుది ఈ దయనీయ గాథ. కేదారేశ్వరరావు చేనేత కార్మిక కుటుంబంలో పుట్టాడు. ప్రాథమిక స్థాయి నుంచి చదువు అంటే మక్కువ. బీఈడీ పూర్తిచేసిన ఆయన 1994లో డీఎస్సీ రాశాడు.

కానీ తక్కువ మార్కులతో ఉద్యోగం కోల్పోయాడు. 1996 డీఎస్సీలో ప్రయత్నించినా సెలక్ట్ కాలేదు. 1998 డీఎస్సీలో మాత్రం క్వాలిఫై అయ్యారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఫలితాలు కోర్టు చిక్కుల్లో పడిపోయాయి. దీంతో కేదారేశ్వరరావు జీవితం అల్లకల్లోలమైంది. మంచి చదవు, వాగ్దాటి, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం ఉన్నా.. ఆయన మాత్రం నిరాశలోకి వెళ్లిపోయారు.

అరకొర ఆదాయం వల్ల పెళ్లి కూడా చేసుకోలేదు. తల్లిదండ్రులు అల్లక నీలకంఠు, అమ్మయమ్మలు మృతి చెందారు. అన్నీ వదిలేసి కులవ్రత్తి వైపు అడుగులు వేశాడు. సైకిల్ పై బట్టల వ్యాపారం చేద్దామనుకుంటే.. ఆయన రూపం చూసి ఎవరూ కొనేవారు కాదు. పైగా చులకనగా చూసేవారు. దీంతో తినడానికి తిండిలేక కాలే కడుపు నింపుకోవడానికి యాచించడానికి కూడా వెనుకాడలేదు.

రెండు దశాబ్దాలుగా ఇలా ఆ జీవితం లాక్కొస్తున్నాడు. కాగా ఇటీవల కోర్టు చిక్కుముడులు వీడి డీఎస్సీ-1998 క్వాలిఫై జాబితాను అధికారులు వెల్లడించారు. అందులో కేదారేశ్వరరావు పేరు ఉంది. కానీ ఆయనకు ఎటువంటి సమాచారం లేదు. గ్రామానికి చెందిన యువకులు ఈ విషయాన్ని ఆయనకు చేరవేశారు. తనకు ఈ విషయం తెలియదని, 23 ఏళ్లు గడిచిపోయిందంటూ కేదారేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 55ఏళ్లు. పాపం విరమణ వయస్సులో ప్రభుత్వం కొలువు వచ్చిందంటూ.. ఆయన పరిస్థితి చూసి చాలా మంది చలించిపోయారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us