Navaratri: శరన్నవరాత్రి మొదటి రోజు ..శ్రీ స్వర్ణకవచాలంకరణ విశిష్టత

NQ Staff - September 23, 2022 / 09:34 AM IST

160250Navaratri: శరన్నవరాత్రి మొదటి రోజు ..శ్రీ స్వర్ణకవచాలంకరణ విశిష్టత

Navaratri:దసరా వేడుకలకు సర్వం సిద్ధమైంది. నవరాత్రి ఉత్సవాలకు అమ్మవారి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. విద్యుద్దీపాలంకరణతో ఆలయాలు మెరిసిపోతున్నాయి. రోజుకో అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ తొమ్మిది రోజుల పాటూ 9 అలంకారాల్లో భక్తులను అనుగ్రహిస్తుంది. ఆ అలంకారాలు-వాటి వెనుకున్న విశిష్టత ఏంటి..

సెప్టెంబర్ 26 నుంచి ..

దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’.ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉహోత్సవాల్లో పరమార్థం . ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై ఆశ్వయుజ శుద్ధ దశమి వరకూ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకరణ దుర్గాదేవిగా దర్శనమిస్తారు. అయితే ఈ అలంకరణకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి

Vijayawada Navaratri Day1 Swarnakavachalankarana

Vijayawada Navaratri Day1 Swarnakavachalankarana

శ్రీ స్వర్ణకవచాలంకరణ దుర్గాదేవి

ఈ అలంకరణకు ఓ విశిష్టత ఉంది. పూర్వం మాధవవర్మ అనే రాజు విజయవాటికాపురిలో ధర్మం నాలుగు పాదాల ఉండేటట్లు అత్యంత జన ప్రియంగా పరిపాలించేవాడు. అతను గొప్ప దేవీ భక్తుడు. ఒక రోజు రాజకుమారుడు నగర సందర్శనం చేస్తుండగా అతని రథ చక్రాల కింద ఒక బాలుడు ప్రమాదవశాత్తు పడి మరణిస్తాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు దు:ఖించి రాజును న్యాయం చేయమని వేడుకుంటారు. రాజు విచారంతో తన కుమారుడే ఈ సంఘటనకు కారణమని తెలిసి మరణశిక్ష విధిస్తాడు. రాజు ధర్మనిరతిని మెచ్చి అమ్మవారు మృతి చెందిన బాలుడిని బతికించడంతో పాటు విజయవాటికాపురిలో కొన్ని ఘడియల పాటు కనకవర్షం కురిపిస్తుంది.

అప్పటి నుంచి అమ్మవారు కనకదుర్గగా కొలుస్తూ దసరా మహోత్సవాల్లో తొలి రోజు స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా అలంకరించడం జరుగుతోంది. ఈ అలంకారంలో అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటే స‌క‌ల ద‌రిద్రాలూ తొల‌గి శుభాలు కలుగుతాయి. నక్షత్రకాంతి కంటే ఎక్కువగా ప్రకాశించే ముక్కుపుడకను ధరించి నిండైన పచ్చని పసిడి వర్ణపు ముఖంతో చిరునవ్వులు చిందిస్తూ అమ్మవారు కనిపిస్తారు.