ప్రధాని మోడీ సైతం అతని తర్వాతే.. యాహూ సెర్చింగ్ జాబితాలో టాప్ లో ఉంది వీరే..!

Admin - December 2, 2020 / 05:41 PM IST

ప్రధాని మోడీ సైతం అతని తర్వాతే.. యాహూ సెర్చింగ్ జాబితాలో టాప్ లో ఉంది వీరే..!

మన దేశంలో ఏ సోషల్ మీడియాలో అయినా ఎప్పుడూ టాప్ లెవల్లో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈసారి రెండో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆయన ఇలా సెకండ్ ప్లేస్ కి పడిపోవటం గత మూడేళ్లలో ఇదే తొలిసారి. ‘ఇంతకీ ఇది ఏ లిస్టు’ అనే కదా మీ అనుమానం?. అది.. సెర్చింజన్ యాహూ రూపొందించిన జాబితా. ఈ ఏడాది నెటిజన్లు తమ ప్లాట్ ఫాంలో వెతికిన సెలబ్రిటీలతో ఆ సంస్థ ఈ లిస్టును తయారుచేసింది. ఇందులో.. ఇటీవల సూసైడ్ చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. ఇతను ఈ సంవత్సరం ‘మోస్ట్ సెర్చ్ డ్ పర్సనాలిటీ’గా నిలిచాడు. అయితే టాప్ న్యూస్ మేకర్స్ కేటగిరీలో మాత్రం మోడీదే అగ్రస్థానం కావటం గమనార్హం.

yahoo 2020

ఇక.. ఉమెన్ సెలబ్రిటీల జాబితాలో ఫస్ట్ ప్లేస్ ను సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా సంపాదించుకోగా మేల్ సెలబ్రిటీల్లో తెలుగు హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చోటు దక్కించుకున్నారు. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు చేయూత అందించిన సోనూ సూద్ ‘హీరో ఆఫ్ ది ఇయర్’గా ప్రత్యేక గుర్తింపు పొందటం విశేషం. పురుషుల జాబితాలో సుశాంత్, మోడీ, అల్లు అర్జున్ లతో పాటు దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, అనురాగ్ కశ్యప్ కూడా ఉన్నారు.

మొత్తమ్మీద అత్యధికంగా సెర్చ్ చేసినవారిలో ఎక్కువ స్థానాలను పొలిటికల్ లీడర్లే ఆక్రమించారు. ఇందులో మోడీ తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రె, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సినిమా రంగం నుంచి అమితాబ్ బచ్చన్, కంగనా రనౌత్, రియా తదితరులు ఉన్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us