kerala: ఆరు స‌ర్జ‌రీలు.. అనారోగ్యంతో ఆత్మ‌హత్య చేసుకున్న ట్రాన్స్‌జెండ‌ర్

kerala: కేర‌ళ‌లో విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. తొలి ట్రాన్స్‌జెండర్‌ రేడియో జాకీ, అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన మొదటి ట్రాన్స్‌జెండర్‌ అనన్య కుమారి అలెక్స్ అనారోగ్యంతో ఆత్మ‌హ‌త్య చేసుకుంది. గ‌త ఏడాది జూన్‌లో ఆరు లింగ‌మార్పిడి శ‌స్త్ర చికిత్స‌లు చేయించుకోవ‌డంతో అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తాయి. ఏడాది నుండి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న క్ర‌మంలో ఆమె కొచ్చిలోని త‌న నివాసంలో ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు తెలుస్తుంది.

Kerala

అన‌న్య కుమారి గ‌తంలో మాట్లాడుతూ.. లైంగిక మార్పిడి వ‌ల‌న ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్న‌ట్టు పేర్కొంది. తనకు సర్జరీ చేసిన ఆస్పత్రి, వైద్యులపై పలు ఆరోపణలు చేశారు అనన్య కుమారి. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తాను ఇంకా కోలుకోలేకపోతున్నానని.. తనకు న్యాయం చేయాలని గతంలో అనన్య కుమారి డిమాండ్‌ చేశారు.

అన‌న్య ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించి కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ జ‌రిపిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అన్యన్య కుమారిది ఆత్మహత్యగా తేల్చారు పోలీసులు. అయితే ఆమె అనారోగ్యం వ‌ల‌న మ‌ర‌ణించిందా లేక ఇత‌ర కార‌ణాల వ‌ల‌న ఆత్మ‌హ‌త్య చేసుకుందా అనేదానిపై విచార‌ణ చేప‌డుతున్నారు.

ఈ ఏడాది జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేయడంతో అనన్య కుమారి పేరు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో అనన్య డెమొక్రాటిక్‌ సోషల్‌ జస్టిస్‌ పార్టీ(డీఎస్‌జేపీ) అభ్యర్థిగా ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ అభ్యర్థి పీకే కుంజలికుట్టికి వ్యతిరేకంగా నామినేషన్‌ దాఖలు చేశారు. సొంత పార్టీ నాయ‌కులే త‌న‌ను బెదిరిస్తున్నార‌ని అందుకే పోటీ నుండి త‌ప్పుకుంటున్న‌ట్టు అన‌న్య అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు. డీఎస్‌జేపీకి ఓటు వేయవద్దని బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. అనన్య మ‌ర‌ణంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.