పెళ్లి పీట‌లెక్కిన టీమిండియా స‌భ్యుడు.. శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్న ప్ర‌ముఖులు

టీమిండియా స‌భ్యులు ఒక్కొక్క‌రుగా పెళ్లిపీట‌లెక్కుతున్నారు.కొన్నాళ్ళుగా ప్రేమ‌లో ఉన్న వీరు మంచి ముహూర్తం చూసుకొని ప‌రిణ‌యమాడుతున్నారు. తాజాగా భార‌త క్రికెట్ టీం ఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్.. వైశాలి విశ్వేశ్వరన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ రోజు తెల్ల‌వారుఝామున వీరి వివాహం జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం క‌రోనా మ‌మ‌హ్మారి వ‌ణికిస్తున్న నేప‌థ్యంలో అన్ని జాగ్రత్త‌లు పాటిస్తూ కొద్ది మంది అతిథుల స‌మ‌క్షంలో వివాహం చేసుకున్నారు. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగిన ఈ పెళ్లి వేడుక‌లో విజ‌య్ శంక‌ర్ సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణలో క‌నిపించారు.

విజ‌య్ శంక‌ర్ ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున మ్యాచ్ లు ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అత‌నికి సన్‌రైజ‌ర్స్ టీం హ్యాపీ మారీడ్ లైఫ్ విజ‌య్ అంటూ విషెస్ తెలిపింది. అంతేకాదు ఆరెంజ్ ఆర్మీ అనే ట్యాగ్ కూడా జ‌త చేసింది. వైశాలి, విజ‌య్‌ల‌కు ఆగ‌స్ట్ 20న నిశ్చితార్ధం కాగా, ఆ వేడుక‌కు సంబంధించిన ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు విజ‌య్. నిశ్చితార్దం జ‌రిగిన‌ట్టు అర్దం వ‌చ్చేలా రింగ్ ఫొటోను షేర్ చేస్తూ ఈ విష‌యాన్ని తెలియ‌జేశాడు. కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహ‌ల్, క‌ర‌ణ్ నాయ‌ర్,అభినవ్ ముకుంద్ తో పాటు ప‌లువురు క్రికెట‌ర్స్ ..ఆల్‌రౌండ‌ర్ కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ప్ర‌స్తుతం విజ‌య్ శంక‌ర్ వ‌య‌స్సు 30 ఏళ్లు కాగా, తొలిసారి 2018లో శ్రీలంక‌తో టీ 20 మ్యాచ్ ఆడాడు. ఇక 50 ఓవ‌ర్ల మ్యాచ్ విష‌యానికి వ‌స్తే మెల్‌బోర్న్‌లో ఆసీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌తో రంగంలోకి దిగాడు. ప్ర‌స్తుతం సెల‌క్ట‌ర్స్ అత‌నిని ప‌క్క‌కు పెడుతుండగా, రానున్న రోజుల‌లో విజ‌య్‌కు అవ‌కాశం రావ‌డం క‌ష్టంగానే కనిపిస్తుంది. కొత్త కుర్రాళ్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న నేప‌థ్యంలో పాత‌వాళ్ల‌కు అవ‌కాశాలు రావ‌డం లేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకున్న చాహ‌ల్ కూడా త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నాడు. ప్రేమ‌లో ఉన్న రాహుల్ కూడా ఏదో ఒక రోజు గుడ్ న్యూస్ చెప్ప‌నున్నాడు. కొద్ది రోజుల క్రిత‌మే ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా వివాహం చేసుకొని ప్ర‌స్తుతం వైవాహిక జీవితం గ‌డుపుతున్నాడు.

Advertisement