Revathi Veeramani: క‌ష్టాల‌ను దిగమింగుకొని ఒలంపిక్స్ అర్హ‌త సాధించిన పేద బిడ్డ‌

Revathi Veeramani: మ‌న‌సులో ఎన్నో కోరిక‌లు కాని పేద‌రికం వారికి అడ్డుగా నిలుస్తుంటుంది. అయితే అన్నింటిని అధిగ‌మించి గోల్‌ని రీచ్ కావ‌డం అనేది కొంద‌రికి సాధ్య‌మవుతుంది. మేకలు కాసే తల్లి కలని నిజం చేసేందుకు ఒకరు.. అమ్మానాన్న లేకున్నా అవ్వ దగ్గర పెరిగి మరొకరు.. సాధించగలవని వెన్ను తట్టిన తాత కలలు నెరవేర్చేందుకు ఇంకొకరు అద్భుతాలు సృష్టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఎట్ట‌కేల‌కు టోక్యో ఒలంపిక్స్‌లో అర్హ‌త సాధించిన రేవ‌తి వీర‌మ‌ణి ఎంద‌రికో ఆద‌ర్శం.

Revathi Veeramani

కాళ్లకు షూస్ లేకుండానే సాధ‌న చేసి అనుకున్న‌ది సాధించింది 22 ఏళ్ల రేవ‌తి వీర‌మ‌ణి. చిన్నత‌నంలోనే అమ్మ నాన్న‌ల‌ని కోల్పోయింది. అమ్మ‌మ్మ చేర‌దీసి రేవ‌తికి రెండో తరగతి నుంచి ప్లస్‌టూ వరకు చ‌దువు చెప్పించింది. హాస్టల్‌లో ఉండి చదువుకొన్న రేవతికి పరుగంటే అమితాసక్తి. ప్లస్‌టూలో 100 మీటర్ల పోటీలో కాళ్లకు షూ కూడా లేకుండా పరుగెత్తి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

రేవ‌తికి ఉన్న‌ప‌ట్టుద‌ల‌ని చూసి కన్న‌న్ అనే శిక్ష‌కుడు ఆమెను ఎంత‌గానో ప్రోత్సాహించాడు. ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్న రేవ‌తి ప‌ట్టుద‌ల‌తో అవ్వ, శిక్షకులు అందించిన ప్రోత్సాహంతో జాతీయ, ప్రపంచ స్థాయి పోటీల్లో పరుగెత్తి చరిత్ర సృష్టించేలా చేశాయి. వెన్నెముక‌కు గాయం త‌గిలినా కూడా ఎంతో శ్ర‌మించి ఒలంపిక్స్ అర్హ‌త పోటీలో పాల్గొంది.

టోక్యో ఒలింపిక్స్‌కు భారత్‌ తరపున క్రీడాకారులను ఎంపిక చేసేందుకు పాటియాలాలో అర్హత పోటీలు నిర్వహించారు. ఇందులో మిశ్రమ రిలే పరుగులో 400 మీటర్ల లక్ష్యాన్ని 53.55సెకన్లలో చేరుకుని రేవతి వీరమణి రికార్డు సృష్టించింది. ఈమె ఒలంపిక్స్‌లో గెల‌వాల‌ని ప్ర‌తి ఒక్క భార‌తీయుడు ప్రార్ధిస్తున్నారు.

revathi veeramani

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరమైన ఒలింపిక్‌ పోటీల్లో 4 X 400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే పరుగు పందెంలో పాల్గొనేందుకు తమిళనాడు నుంచి మ‌రో ఇద్ద‌రు అమ్మాయిలు అర్హ‌త సాధించారు. వారిలో ఒకరు తిరుచ్చికి చెందిన ధనలక్ష్మి. ఏడేళ్ల క్రితం తండ్రి మరణించడంతో త‌ల్లి అండ‌దండ‌ల‌తో ఈ స్థాయికి చేరుకుంది. తాజాగా జరిగిన జాతీయ స్థాయి పరుగు పందెంలో 100 మీటర్లను 11.38 సెకన్లలో పూర్తిచేసి బంగారు పతకాన్ని సాధించింది.

ఇక తిరుచ్చి జిల్లా తిరువెరుంబూర్‌ అనే కుగ్రామంకి చెందిన శుభా వెంకటేశన్ కూడా ఒలంపిక్స్‌కి ఎంపికైంది. 2012లో చెన్నైలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో స్థానం సాధించిన శుభ ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. 21 ఏళ్ల శుభ జాతీయ స్థాయిలో 20, అంతర్జాతీయ స్థాయిలో మూడు పతకాలను సాధించింది. త‌న‌ కుటుంబం అండగా నిలవడం వల్లే ఇదంతా సాధించాన‌ని అంటుంది శుభా.