PM: చాలా ‘సంతోషం’గా ఉందంటూ తెలంగాణ ఎంపీకి ప్రధాని మోడీ ప్రశంసలు

PM: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ని మెచ్చుకున్నారు. ఆయన చానాళ్లుగా చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఈ ప్రోగ్రామ్ పచ్చదనం ప్రాముఖ్యతను దేశ ప్రజలకు తెలియజేస్తోందంటూ అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకొని తాను వ్యక్తిగతంగా, ప్రధానిగా ఎంతో ఆనందించానని చెప్పారు. ఈ మేరకు మోడీ ఎంపీ సంతోష్ కుమార్ కి వారం కిందట (ఈ నెల 21న) రాసిన లేఖ గురించి ఆలస్యంగా తెలిసింది. సాక్షాత్తూ దేశ ప్రధానే తనకు కాంప్లిమెంట్స్ ఇవ్వటం పట్ల సంతోష్ కుమార్ ట్విట్టర్ లో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. మీ ప్రోత్సాహం నన్ను మరింత ఉత్సాహవంతంగా ముందుకు వెళ్లేలా చేస్తుందని పేర్కొన్నారు.

pm modi

అందరం.. ఆ తల్లి బిడ్డలమే..

‘‘భూమాతని, ప్రకృతిని ఆరాధించటం మనకి ఆది నుంచి వస్తున్న సత్ సంప్రదాయం. సంస్కృతిలో ఒక భాగమైన ఆ స్ఫూర్తిని ప్రతిఒక్కరిలో నింపేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తోడ్పడుతోంది. మనమంతా భూతల్లి బిడ్డలమే. అందుకే ప్రకృతితో సహ జీవనం చేద్దాం. ప్రకృతితో సమన్వయం చేసుకుందాం. ఇదే మన లైఫ్ స్టైల్ కావాలి. ప్రకృతిపరంగా మన ఘన వారసత్వాన్ని కాపాడుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది’’ అంటూ ప్రధాని మోడీ తన లేఖలో తెలిపారు.

pm modi

వృక్షవేదం.. ప్రత్యేక ప్రస్తావన..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఎంపీ సంతోష్ కుమార్ గతంలో వృక్షవేదం పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ప్రధాని మోడీ దీని గురించి గురించి తన లెటర్ లో ప్రస్తావించటం గమనార్హం. సొసైటీలోని ప్రజలంతా తప్పకుండా ఈ బుక్ చదవాలని సూచించారు. దేశవ్యాప్తంగా మొక్కలు నాటాలని, పచ్చదనం పెంచాలని కోరారు. ఈ విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తిని మరింత వేగంగా, మరింత ఎక్కువ మందిలోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. సౌరశక్తి వంటి సంప్రదాయేతర ఇంధన వనరులను వాడటం ద్వారా గాల్లోకి కార్బన్ ఉద్గారాలను తగ్గించొచ్చని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం వల్ల కూడా పర్యావరణాన్ని పరిరక్షించొచ్చని ప్రధాని మోడీ వివరించారు.

pm modi