Mamata Banerjee : జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం.. అంటూ గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హంగామా చేస్తోన్న విషయం విదితమే. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమా పలువురు జాతీయ స్థాయి నేతలతో, బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేసీయార్ మంతనాలు జరుపుతూ వస్తున్నారు.

కేసీయార్ తరహాలోనే, ఆ మాటకొస్తే ఇంకా ఎక్కువ స్థాయిలోనే కేంద్రంలోని బీజేపీతో పొలిటికల్ ఫైట్ చేస్తున్నారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. అయితే, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రంతో సఖ్యతగా వుండాలన్న విషయంలో మమతా బెనర్జీ ఆలోచనలు వేరు.. కేసీయార్ వ్యవహార శైలి వేరు.
ప్రధానితో మమత భేటీ.. కేసీయార్‌కి ఝలక్.?
ఇటీవల కేసీయార్ ఢిల్లీకి వెళ్ళారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కలవలేదు. తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినా, ప్రోటోకాల్ ప్రకారం ప్రధానికి హైద్రాబాద్‌లో కేసీయార్ స్వాగతం పలకలేదన్న విమర్శలున్నాయి. ఈ తరుణంలో, ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇటీవల తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన మంత్రి పార్ధా ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన దరిమిలా, మోడీ – మమత తాజా భేటీపై ఆసక్తికరమైన వాదనలు జాతీయ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. బీజేపీతో మమత సర్దుకుపోనున్నారా.? అన్న రాజకీయ గుసగుసలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ఒకింత గుస్సా అవుతున్నారట.