Black Fungus: బ్లాక్ ఫంగ‌స్‌ ఎఫెక్ట్.. చిన్నారుల‌ క‌ళ్లు తొల‌గింపు

Black Fungus: గ‌త ఏడాది క‌రోనా అంద‌రిలో భ‌యాందోళ‌న‌లు క‌లుగజేయ‌గా, ఈ ఏడాది క‌రోనాతో పాటు బ్లాక్ ఫంగ‌స్ భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తుంది. క‌రోనా నుండి కోలుకున్న కొంద‌రు బ్లాక్ ఫంగ‌స్‌తో నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా బ్లాక్ ఫంగ‌స్ అంద‌రిపై ప్ర‌తాపం చూపించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. ముంబైలో బ్లాక్ ఫంగస్ సోకిన ముగ్గురు చిన్నారులకు శస్త్ర చికిత్స నిర్వహించి వారికి ఒక్కొక్క కన్ను తొలగించారు వైద్యులు.

Black fungus

పిల్లలలో మ్యూకోర్ మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ కేసులు ఆందోళన కలిగించే సంకేతం అని వైద్యులు అంటున్నారు. ఈ ఇన్ఫెక్షన్ కరోనా రోగులను, డయాబెటిస్ రోగులను లక్ష్యంగా చేసుకుంటుందని, కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత కూడా ఇది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తోందని చెప్తున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడి క‌ళ్లు పోగొట్టుకున్న వారిలో 4,6,14 ఏళ్ల పిల్లలు ఉన్నారు. ఫంగస్‌ బారిన పడిన ముగ్గురిలో ఇద్దరికి ఒక ఆస్పత్రిలో, మరోకరి వేరేక ఆస్పత్రిలో సర్జరీ చేసి ఒక కన్ను తొలగించారు.

ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక‌కు డ‌యాబెటిస్ స‌మ‌స్య ఉండ‌గా, ఆమెకు ఇటీవ‌ల కంట్లో ఇబ్బందిగా అనిపించి ఆసుప‌త్రికి వెళ్లింద‌ట‌. ఆసుప‌త్రికి వెళ్లిన 48 గంట‌ల‌లో బాలిక క‌న్ను న‌ల్ల‌గా మారింది. ఫంగ‌స్ ముక్కు వ‌ర‌కు సోక‌డంతో వైద్యులు కంగారు ప‌డ్డారు. మెద‌డు వ‌ర‌కు ఫంగ‌స్ సోకే ప‌రిస్థితి ఉన్న నేప‌థ్యంలో వైద్యులు ఆరు వారాల పాటు వైద్యంచేసి చివ‌రికి బాలిక కంటిని తొల‌గించారు.

Black fungus

ఇక మ‌రో ఇద్ద‌రు చిన్నారుల విష‌యానికి వ‌స్తే వీరికి డ‌యాబెటిక్ స‌మ‌స్య లేదు కాని వీరికి కోవిడ్ వ‌ల‌న బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చింది. వీరిని ముంబైలోని కేబీహెచ్ బచువాలి ఆప్తాల్మిక్ అండ్‌ ఈఎన్‌టీ ఆసుపత్రిలో చేర్చారు. క‌న్ను తొల‌గించ‌క‌పోతే వారికి ప్ర‌మాదం ఏర్ప‌డుతుంద‌ని భావించి క‌న్ను తొల‌గించారు. ఇక 16 ఏళ్ల బాధితురాలు నెల రోజుల క్రితం వరకు ఆరోగ్యంగానే ఉంది. కోవిడ్‌ బారిన పడి కోలుకుంది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆమె డయాబెటిస్‌ బారిన పడింది.క‌రోనా కోసం వాడిన మందుల వ‌ల‌న బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చి ఉంటుంద‌ని వైద్యులు భావిస్తున్నారు. యాంజియోగ్రఫీ చేసి ఆమె కడుపు దగ్గర రక్తనాళాలకు బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్లు గుర్తించామని తెలిపారు వైద్యులు.

బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ దూకుడుగా ఉన్నందున ముందుగానే గుర్తించాలని లేదంటే మెదడుకు సోకే ప్రమాదముందని, ఒక్కోసారి కళ్లను తీసివేయడంతో పాటుగా, దవడలను కూడా తొలగించాల్సి వస్తుంది అని వైద్యులు చెబుతున్నారు.