Dinesh Karthik: నేను మాట్లాడిన మాట‌ల‌కు త‌ల్లి, పెళ్లాం కోప‌డ్డారు: దినేష్ కార్తీక్

Dinesh Karthik: భార‌త్ స్పెష‌లిస్ట్ కీప‌ర్స్‌లో దినేష్ కార్తీక్ ఒక‌రు. ఆయ‌న కెరీర్‌లో పెద్ద‌గా వివాదాలు ఏమి లేవు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి దూరమైన దినేశ్ కార్తీక్.. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా బిజీగా ఉన్నాడు. ఇటీవల భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కామెంట్రీ చేసిన దినేష్ కార్తీక్ ఇప్పుడు ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న సిరీస్‌కి కూడా కామెంటేటర్‌గా ఉన్నాడు.

dinesh karthik

రెండో వ‌న్డే జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ త‌న బ్యాట్ మార్చాడు. దీనిపై దినేష్ కార్తీక్ వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేశారు. ‘‘బ్యాట్స్‌మెన్‌లు తమ బ్యాట్‌లను పెద్దగా ఇష్టపడరు. దాంతో.. చాలా వరకూ అవి చేతులు మారుతూ ఉంటాయి. కానీ.. టీమ్‌లోని సహచరుల ఆటగాళ్ల బ్యాట్‌లను మాత్రం వారు బాగా లైక్ చేస్తుంటారు. వాళ్లకి బ్యాట్‌‌లు పక్కింటి భార్యలా అన్నమాట. వాటిని ఎప్పుడూ బెటర్‌గా ఫీలవుతుంటారు’’ అని చెప్పుకొచ్చాడు.

దినేష్ కార్తీక్ వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్ని రేపాయి. మెంటేట‌ర్‌గా ఉన్న స‌మయంలో ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాదు. నువ్వు ఈ వ్యాఖ్య‌ల‌పై త‌ప్ప‌క క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ నేప‌థ్యంలో మూడోవ‌న్డే జ‌ర‌గుతున్న స‌మ‌యంలో కామెంట్రీ బాక్స్ వేదిక‌గా బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌ళు చెప్పాడు.

గ‌త మ్యాచ్ లో నేను మాట్లాడిన దానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అనుకుంటున్నాను. ఇది నా ఉద్దేశ‌మే కాదు. త‌ప్పుగా వ్యాఖ్యానించాను. ఈ విష‌యంపై ప్ర‌తి ఒక్క‌రికి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను. అలా మాట్లాడ‌డంపై నా భార్య‌, నా త‌ల్లి కూడా కోపడ్డారు. మ‌రోసారి ఇలా జ‌ర‌గ‌కూడ‌ద‌ని భావిస్తున్నాను అంటూ కామెంట్రీ బాక్స్ నుండే క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేశాడు కార్తీక్.

dinesh karthik

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కంటే ముందే ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి దినేశ్ కార్తీక్ ఎంట్రీ ఇచ్చినా.. ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా మాత్రం అర్హత సాధించలేకపోయాడు. ధోనీ వెలుగులోకి వచ్చిన తర్వాత బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే టీమ్‌లోకి ఎంపికవుతూ వచ్చిన కార్తీక్.. ధోనీ మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా మారిన తర్వాత క్రమంగా టీమిండియాకి దూరమైపోయాడు.

2019 వన్డే ప్రపంచకప్‌కి దినేష్ కార్తీక్‌ని భారత సెలెక్టర్లు ఎంపిక చేయ‌గా, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌‌లో దినేశ్ కార్తీక్‌ని నెం.5 స్థానంలో బ్యాటింగ్‌కి పంపగా.. 25 బంతులాడిన అతను కేవలం 6 పరుగులే చేసి ఔటయ్యాడు. ఇక అక్కడి నుంచి దినేశ్ కార్తీక్‌పై వేటు కొనసాగుతోంది.