Cycling: కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు 2800 కి. మీ ల సైక్లింగ్.. అంగవైకల్యాన్ని జయించాడు

Cycling: మనసులో ధృఢమైన సంకల్పం ఉంటే జీవితంలో ఏదైనా సాధించొచ్చు. దేశానికి కీర్తి, ప్రతిష్టను సంపాదించాలనే అతని కోరిక, పట్టుదల, ఆత్మ విశ్వాసం ముందుకు అతనికి ఉన్న వైకల్యం కూడా చిన్నబోయింది. తన వైకల్యాన్ని కూడా గుర్తించకుండా జాతీయ సమైఖ్యతా స్పూర్తిని దేశానికి చాటి చెప్పే ప్రయత్నంలో 2800 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ యాత్రగా శ్రీకారం చుట్టాడు.

ఎంతో ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుని సైకిల్ యాత్రలో పాల్గొన్నాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన అజయ్ కుమార్ సింగ్ సీఆర్పీఎఫ్ లో కీలకమైన అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2014 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల విధుల్ని నిర్వర్తిస్తున్నప్పుడు ఛత్తీస్ ఘడ్ లో జరిగిన బాంబు పేలుడులో ఎడమ కాలు తొడ భాగం వరకు కోల్పోయాడు. తన మనోస్థైర్యాన్ని కోల్పోకుండా కృత్రిమ కాలును అమర్చుకున్నాడు.

ప్రస్తుతం సీఆర్పీఎఫ్ కి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్ మెంట్ లో ఇన్స్ పెక్టర్ హోదాలో కొనసాగుతున్నారు. తన దేశానికి ప్రత్యేకతను చాటాలనే ఉద్ధేశ్యంతో సైకిల్ యాత్రను సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రస్తుతం దేశంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో కన్యాకుమారి నుండి ఢిల్లీలో రాజ్ ఘాట్ వరకు 2800 కిలోమీటర్లు సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. ఈ బృందానికి ఆదిలాబాద్ జిల్లాలో స్వాగతం లభించింది.

నేరడిగొండ, ఇచ్చోడ మండల కేంద్రాల్లో ఈ సైకిల్ యాత్రను కొనసాగించారు. ఈ జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో స్టే చేసి ఈరోజు ఉదయం జాతీయ రహదారి అయిన మహారాష్ట్రలో సక్సెస్ ఫుల్ గా తమ యాత్రను సాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ, అజయ్ చేస్తున్న ఈ సాహసానికి ప్రత్యేకంగా అభినందించారు.

ఇదే స్పూర్తితో దేశానికి మరింత కీర్తిని తెచ్చిపెట్టాలని కోరారు. అజయ్ ఎంతోమందికి స్పూర్తిధాయకంగా నిలవాలని, తమకు ఉన్న అంగవైకల్యాన్ని సైతం పక్కన పెట్టి అనుకున్నది సాధించాలని అన్నారు. వీరి సైకిల్ యాత్ర విజయవంతం కావాలనే సోషల్ మీడియాలో కూడా పలు పోస్ట్ లు, వార్తలు వైరల్ అవుతున్నాయి