Bihar CM Nitish Kumar : బీజేపీకి షాక్: బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.!
NQ Staff - August 9, 2022 / 04:42 PM IST

Bihar CM Nitish Kumar : భారతీయ జనతా పార్టీ మద్దతుతో బీహార్‌లో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్‌ని కలిసి రాజీనామాని కూడా సమర్పించారు. నితీష్ కుమార్ రాజీనామా సమయంలో ఆయన వెంట ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో ఉద్ధవ్ ధాక్రే ప్రభుత్వాన్ని బీజేపీ కుప్ప కూల్చిన విషయం విదితమే. ఆ కూల్చివేతతో పోల్చలేంగానీ, ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ’ తరహాలోనే, బీజేపీకి బీహార్‌లో దెబ్బ తగిలిందన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన. అయితే, బీజేపీ ఈ విమర్శల్ని తిప్పి కొడుతోంది.
బీజేపీకి వెన్నుపోటు పొడిచిన నితీష్ కుమార్..

Bihar CM Nitish Kumar Resigns
బీజేపీకి నితీష్ కుమార్ వెన్నుపోటు పొడిచారనీ, నమ్మి ముఖ్యమంత్రి పదవిని అప్పగిస్తే.. ఇలా నట్టేట్లో ముంచుతారా.? బీహార్ ప్రజల్ని సైతం నితీష్ కుమార్ మోసం చేశారంటూ బీజేపీ మండిపడుతోంది. కాగా, ‘బీజేపీతో ప్రయాణం ముగిసింది..’ అని ప్రకటించిన నితీష్, పాత మిత్రులైన ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు దగ్గరయ్యారు.
ఆర్జేడీ, కాంగ్రెస్ సాయంతో నితీష్ కుమార్ మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. తేజస్వి యాదవ్‌కి హోంమంత్రిత్వ శాఖ దక్కబోతోందని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనల్ని కూడా ఇప్పటికే గవర్నర్‌కి నితీష్ కుమార్ సమర్పించారట.