మహా దారుణం : ప్రమాదంలో భారతం

కరోనా సృష్టిస్తున్న ప్రళయానికి యావత్‌ భారతావని వణుకుతోంది. మునుపటి కంటే రెట్టింపు వేగంతో విస్తరిస్తోన్న ఈ మహమ్మారి.. ఒక్క రోజే దాదాపు 3లక్షల మందిపై విరుచుకుపడింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2.95లక్షల కేసులు నమోదయ్యాయి. కరోనా దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఇదే సమయంలో మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా 2023 మందిని వైరస్‌ బలితీసుకుంది.

corona

దేశంలో రోజువారీ మరణాలు 2వేలు దాటడం ఇదే తొలిసారి.

మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16,39,357 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 2,95,041 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,56,16,130కి  చేరింది.

ఇదే సమయంలో కొవిడ్‌తో 2023 మంది మృత్యువాతపడ్డారు. కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు మంది 1,82,553 మంది వైరస్‌కు బలయ్యారు. మరణాల రేటు 1.18శాతంగా ఉంది.
ఒక్కరోజులో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 519, దిల్లీలో 277, ఉత్తరప్రదేశ్‌లో 162 మరణాలు నమోదయ్యాయి.

మరోవైపు గడిచిన 24 గంటల్లో మరో 1,67,457 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 1,32,76,039 మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 85.56శాతంగా ఉంది.
కరోనా ఉద్ధృతితో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 21లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21,57,538 యాక్టివ్‌ కేసులుండగా.. క్రియాశీల రేటు 13.26శాతానికి పెరిగింది..

కరోనా విషయంలో కేంద్రం లాక్ డౌన్ పెట్టలేమని తేల్చి చెప్పటంతో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటున్నాయి. పాండిచ్చేరి లో 22 నుండి 25 దాక లాక్ డౌన్ ప్రకటించారు. ఇక మహారాష్ట్ర లో 22 నుండి మే 1 దాక సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. అదే సమయంలో టీకాల విషయంలో కేంద్రం సృష్టమైన ప్రకటన ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్‌ సంస్థల నుంచి టీకాలు కొనుగోలు చేయొచ్చు అని చెప్పింది.

ఈ నేపథ్యంలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తన కరోనా వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో వ్యాక్సిన్‌ను ₹400కు ఇవ్వనున్నారు. ప్రయివేటు ఆసుపత్రులకు ₹600 చొప్పున వసూలు చేస్తామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి పాత ధర (₹250)కే ఇవ్వనుంది.

Advertisement