Vishnu Manchu: శ్రీహ‌రి అంకుల్ ఉండుంటే నీ సంగ‌తి చెప్పేవారు.. ప్ర‌కాశ్ రాజ్‌పై విష్ణు ఫైర్

Vishnu Manchu: మా ఎన్నిక‌ల నేప‌థ్యంలో మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్ మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి.పాత సంఘ‌ట‌న‌ల‌ను కూడా తవ్వి నానా రచ్చ చేస్తున్నారు. అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నటువంటి ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు ఇద్దరు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఒక విధంగా పొలిటికల్ పార్టీ తరహాలోనే మా ఎన్నికలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఇక ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

దివంగత నటుడు శ్రీహరి టాపిక్ తీస్తూ ప్రకాష్ రాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు విష్ణు. అసలు నిజాలు అన్నీ మర్చిపోయారా. 2004 – 2005లో ఏం జరిగిందో గుర్తు లేదా? శ్రీహరి అంకుల్ గానీ బతికి ఉంటే మీకు సరైన గుణపాఠం చెప్పేవారు. ప్రస్తుతం స్వర్గంలో ఉన్న ఆయనే మీకు సరైన సమాధానం చెప్పేవారంటూ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు మంచు విష్ణు. ‘మా’ అసోసియేషన్‌ని ప్రకాష్‌ రాజ్‌ రెండుగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంటూ ఫైర్ అయ్యారు.

వస్తాడు నా రాజు సినిమాకు నేనే హీరో నేనే నిర్మాతను. ఆ సినిమా దర్శకుడిని మీరు పదిమందిలో బూతులు తిట్టారు. చాలా దుర్భాషతో మాట్లాడారు. ఆ విషయాన్ని ఎవరికైనా ఈ రోజు వరకు చెప్పానా? కానీ మీరు చెప్పిస్తున్నారు. ఈరోజు నా కుటుంబ సభ్యులను మీరు అనవసరంగా లాగుతున్నారు. సాఫీగా సాగే ఈ ఎలక్షన్స్ లో కూడా మీరు కాంట్రవర్సి చేస్తున్నారు. ఈవీఎం కావాలి బ్యాలెట్ పేపర్స్ వద్దు అంటున్నారు అయితే రేపు ఈవీఎంలో కూడా నేను గెలిస్తే మళ్లీ అక్కడ ఏదో మోసం జరిగింది అని కూడా అంటారు. అలాంటి ఆరోపణలు కూడా మీరు చేస్తారు.. అని విష్ణు మాట్లాడాడు.

విష్ణు వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కాశ్ రాజ్ కూడా అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. నేను ఏమైన వారి ఫ్యామిలీని తిట్టానా..! అత‌నే అన్నీ అనుకుంటున్నాడు. ఆ రోజు ఏం జ‌రిగిందే చెప్పి ఉంటే నేను చెప్పేవాడిని అంటూ ప్ర‌కాశ్‌రాజ్ కూల్‌గా స్పందించారు. ప‌దో తారీఖు వ‌ర‌కు ఈ ర‌చ్చ కొన‌సాగుతూనే ఉంటుంది.