Tollywood : ఓటీటీకి ఝలక్.! టాలీవుడ్‌లోనే భిన్నాభిప్రాయాలు.!
NQ Staff - June 29, 2022 / 10:24 PM IST

Tollywood : జులై 1 నుంచి ఆయా సినిమాలు చేసుకునే ఓటీటీ ఒప్పందాలకు సంబంధించి తెలుగు సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతగానీ, ఆ సినిమా ఓటీటీలో రావడానికి వీల్లేదన్నది తాజా నిబంధన.

Tollywood producers about OTT release
ఓ కోణంలో చూస్తే, ఈ నిబంధన మంచిదే. కానీ, ఈ నిబంధన విషయంలో సినీ పరిశ్రమలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సినిమా టిక్కెట్ల ధరల విషయంలో జరిగినట్లే, ఇప్పుడు ఈ ఓటీటీ డీల్ విషయంలోనూ తెలుగు సినీ పరిశ్రమకు గూబ గుయ్యిమనిపోవడం ఖాయమన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
ఓటీటీనే దిక్కు.! నో డౌట్ ఎట్ ఆల్.!
ఔను, కొన్ని సినిమాలకు ఓటీటీనే దిక్కు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం. సినీ ప్రేక్షకుడి ఆలోచన మారిపోయింది. ఓటీటీలో బోల్డంత కంటెంట్ దొరుకుతోంది. దాన్ని కాదనుకుని, థియేటర్లకు ప్రేక్షకులు వెళ్ళాలంటే, ఆ సినిమాలో చాలా అద్భుతాలే జరగాలి. కానీ, ప్రస్తుతం వస్తోన్న సినిమాల నుంచి అద్భుతాల్ని ఆశించలేం.
సినిమాని రెండు వారాల్లోనో మూడు వారాల్లోనో ఓటీటీలో విడుదల చేస్తే, దానికి ఓ రకమైన ఒప్పందం వుంటుంది. అదే యాభై రోజుల తర్వాత అంటే ఇంకో రకమైన ఒప్పందం వుంటుంది. లాంగ్ గ్యాప్ అంటే, ఒప్పందాల కారణంగా నిర్మాతకు వచ్చే అమౌంట్ తగ్గిపోతుంది కదా.?
ఇటు థియేటర్లలో బొమ్మ ఆడక, అటు ఓటీటీ నుంచి డబ్బులు రాక.. నిర్మాత ఎటూ కాకుండా పోయే పరిస్థితి ముందు ముందు రావొచ్చు.