NTR : ట్వీట్లెందుకు, తాత కోసం తొడ కొట్టొచ్చుగా.! ఎన్టీయార్‌పై మాజీ మంత్రి అనిల్ సెటైర్లు.!
NQ Staff - September 23, 2022 / 06:26 PM IST

NTR : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు నందమూరి తారకరామారావు పేరుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హెల్త్ యూనివర్సిటీ నుంచి తొలగించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఎన్టీయార్ పేరు తీసేసి, వైఎస్సార్ పేరుని పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో టీడీపీ నానా యాగీ చేస్తోంది. సినీ నటుడు యంగ్ టైగర్ ఎన్టీయార్ కూడా ట్విట్టర్ వేదికగా ఈ అంశంపై స్పందించాడు.

social media trolls on NTR
‘పేరు మార్చడం వల్ల ఎన్టీయార్ స్థాయిని తగ్గించలేరు..’ అంటూ జూనియర్ ఎన్టీయార్ పేర్కొనడం వైసీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. అదే సమయంలో, ‘ఇద్దరూ గొప్పోళ్ళే..’ అని ఎన్టీయార్‌తోపాటు వైఎస్సార్ పేరునీ జూనియర్ ఎన్టీయార్ ప్రస్తావించడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది.
మాజీ మంత్రి అనిల్ సవాల్..
స్వర్గీయ ఎన్టీయార్ పట్ల తమకు అపారమైన గౌరవం వుందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అందుకే, ఎన్టీయార్ జిల్లా.. అంటూ జిల్లాల విభజన తర్వాత ఓ జిల్లాకు స్వర్గీయ ఎన్టీయార్ పేరు పెట్టామనీ, దాన్ని ఎన్టీయార్ కుటుంబ సభ్యులు హర్షించకపోవడం శోచనీయమని అన్నారు.
అప్పుడు లేవని నోళ్ళు, ఇప్పుడెందుకు లేస్తున్నాయంటూ అనిల్ మండిపడ్డారు. ‘స్వర్గీయ ఎన్టీయార్ మీద కొందరు చెప్పులు విసిరారు.. స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించిన పార్టీని నారా చంద్రబాబు నాయుడు కబ్జా చేశారు. ఆ సందర్భాల్లో ఎన్టీయార్ ఆవేదన ఆయన కుటుంబ సభ్యులకు పట్టలేదు..’ అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.
తాత కోసం ట్వీట్లేయడం కాదు, తొడకొట్టాలంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్ పేరు ప్రస్తావించకుండానే సవాల్ విసిరారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.