Siddharth : ప్ర‌ధానికి స‌పోర్ట్‌గా సైనా నెహ్వాల్ ట్వీట్.. కౌంట‌ర్ ఇచ్చిన హీరో సిద్ధార్థ్‌

Siddharth : తమిళ నటుడు సిద్ధార్థ్ ఈ మ‌ధ్య వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారాడు. సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్నాయి. జాతీయ మహిళా కమిషన్ సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుందంటే- ఆ కామెంట్స్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సిద్ధార్థ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఎన్‌సీడబ్ల్యూ మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు లేఖ రాసింది.

Siddharth responds to Saina Nehwal comments
Siddharth responds to Saina Nehwal comments

నటుడు సిద్దార్థ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే.. షట్లర్ సైనా నెహ్వాల్‌ను విమర్శిస్తూ చేసిన ట్వీటే ఇందుకు కారణం. సిద్దార్థ్ చేసిన ఈ ట్వీట్‌పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, గాయని చిన్మయి శ్రీపాద సహా పలువురు.. సిద్దార్థ్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

మోడీ పంజాబ్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయన ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో ఫ్లైఓవర్‌పై సుమారు 20 నిమిషాల పాటు ఆయన ట్రాఫిక్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. దీనిపై స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ స్పందించారు. సాక్షాత్తూ ఓ ప్రధానమంత్రి భద్రత వ్యవస్థలో లోపాలు తలెత్తడాన్ని ఏ దేశం కూడా చూస్తూ ఊరుకోబోదని అన్నారు.

ప్రధాని భద్రత వ్యవహారాలతో రాజీపడటం శ్రేయస్కరం కాదని చెప్పారు. ఈ ఘటనను తాను ఖండిస్తున్నానని సైనా నెహ్వాల్ చెప్పారు. ప్రధానిపై కొందరు అరాచకవాదులు దాడి చేయడానికి ప్రయత్నించారని, అది పిరికిపంద చర్యగా సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. దీనిపై సిద్ధార్థ్ స్పందించారు. ఆమె చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. సెక్సీయెస్ట్ కామెంట్స్ చేశారు.

షటిల్ కాక్‌ను సబ్‌టల్ కాక్‌గా అభివర్ణించారు. సబ్‌టల్ కాక్ ఛాంపియన్ అంటూ సంబోధించారు. సబ్‌టల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్.. అంటూ ఎద్దేవా చేశారు. భారత్‌కు సంరక్షకులు ఉండటం తమ అదృష్టమని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతోన్నాయి. సబ్‌టల్ కాక్ అనే పదాన్ని ప్రయోగించడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి.

సిద్దార్థ్ చేసిన కామెంట్స్‌పై సైనా నెహ్వాల్ కూడా స్పందించారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన సైనా.. ‘అతను (సిద్ధార్థ్) ఏమి చెప్పాడో నాకు ఖచ్చితంగా తెలియదు. నటుడిగా నేను అతన్ని ఇష్టపడతాను. కానీ ఇది మంచిది కాదు. అతను మంచి పదాలతో తన భావాలను వ్యక్తపరచవచ్చు. కానీ అది ట్విట్టర్. మీరు అలాంటి పదాలు, వ్యాఖ్యలను గుర్తిస్తారు’ అని పేర్కొంది.