Radha : ఒకప్పటి సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు బుల్లితెరపై సీరియల్స్ లేదంటే షోలకు జడ్జిలుగా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు.ఇప్పటికే రమ్యకృష్ణ, శిల్పా శెట్టి, ఆమని, ప్రియమణి, సదా, మాధురీ దీక్షిత్ వంటి ఎందరో హీరోయిన్లు బుల్లి తెరపై సందడి చేస్తూ .. ప్రేక్షకులను అలరిస్తున్నారు. వీరి బాటలో నడవడానికి అలనాటి సీనియర్ స్టార్ హీరోయిన్ రెడీ అయ్యింది.

దక్షిణాది భాషల్లో 80వ దశకంలో ప్రేక్షకులను తన అందచందాలతో కట్టిపడేసిన హీరోయిన్లలో రాధ ముందువరుసలో ఉంటుంది. చూడచక్కని రూపం, అభినయం, డ్యాన్స్ టాలెంట్ అన్నీ కలగలిస్తే రాధ అవుతుంది. 90వ దశకంలో సినీ రంగానికి గుడ్ బై చెప్పిన రాధ పెళ్లి తర్వాత ముంబయిలో సెటిలైంది. అడపాదడపా ఈవెంట్లలో దర్శనమిస్తూ అభిమానులను అలరిస్తోంది.
ఇప్పుడు రాధ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతుంది. ఓ టీవీ ఛానెల్‌లో జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న “సూపర్ క్వీన్” కార్యక్రమానికి రాధ జడ్జ్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని రాధ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చాలాకాలం తర్వాత ఓ రియాల్టీ షో ద్వారా మళ్లీ మీ ముందుకు వస్తున్నానని రాధ ట్వీట్ చేసారు.
తన సహ న్యాయనిర్ణేతగా నకుల్ వ్యవహరిస్తున్నారని, ఇందుకు చాలా సంతోషదాయకంగా ఉందని పేర్కొన్నారు. ఈ షోలో ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తున్నానని ఈ అందాలనటి పేర్కొన్నారు. ఎంతోమంది అమ్మాయిల ప్రతిభను ఈ కార్యక్రమం ద్వారా చూడటం గర్వంగా ఉందని తెలిపారు. అంతేకాదు, ‘సూపర్ క్వీన్’ ప్రోమో విడుదల చేశారు.
సీనియర్ నటి రాధ వారసురాలిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన హీరోయిన్ కార్తీక. ‘కో’ చిత్ర దర్శకుడు కేవీ ఆనంద్ తెరకెక్కించిన చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. అయితే, సినీ రంగంలో అడుగుపెట్టేందుకు తన తల్లి ఇమేజ్ కార్తీకకు సినీ అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది. ఈమె నటించిన ‘అన్నకొడి’, ‘పురంబోక్కు’ వంటి చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. టాలీవుడ్‌లో కూడా ఈ అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి.ఈ నేపథ్యంలో సినిమాల వైపే కన్నెత్తి చూడరాదన్న కఠిన నిర్ణయంతో ఆమె నటనకు గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నట్టు సమాచారం.