Ram Gopal Varma : రెండు గంట‌లకు పైగా నానితో చ‌ర్చ‌లు.. సమావేశం వివ‌రాలు వెల్ల‌డించిన వ‌ర్మ‌

Ram Gopal Varma : అమరావతి సచివాలయంలో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలకు పైగా సాగుతున్న ఈ చర్చల్లో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి.టికెట్ ధరలపై ఐదారు కీలక అంశాలు ప్రస్తావించానని, మంత్రి పేర్ని నాని ఎన్నో ఇతర అంశాలు ప్రస్తావనకు తీసుకువచ్చారని వర్మ పేర్కొన్నారు.

Ram Gopal Varma and Perni nani meeting
Ram Gopal Varma and Perni nani meeting

టికెట్ ధర పెరిగితే ప్రజలు ఇబ్బందిపడతారని మంత్రి చెప్పారని వెల్లడించారు. టికెట్ ధర తగ్గిస్తే ఈ ప్రభావం సినిమా నాణ్యతపై పడుతుందని తాను చెప్పానని అన్నారు. తప్పుడు కలెక్షన్లు, పన్ను ఎగవేతలపై చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించానని వెల్లడించారు.

మరిన్ని అభిప్రాయాలు పంచుకునేందుకు ఈ సమావేశం దోహదపడిందని తెలిపారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నానని చెప్పారు. అయితే సమస్య పరిష్కార బాధ్యత ప్రభుత్వం, సినిమా పరిశ్రమపై ఉందని వర్మ స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం తనకుందని పేర్కొన్నారు. చర్చలు జరిగిన తీరుపై 100 శాతం సంతృప్తిగా ఉందని తెలిపారు.

కాగా, థియేటర్ల మూసివేత అంశంపై తాను చర్చించలేదని వర్మ వెల్లడించారు. పవన్ కల్యాణ్, బాలకృష్ణ వంటి అగ్రనటులను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని తాను భావించడంలేదని అన్నారు. ఒకరిద్దరి కోసం యావత్ చిత్రపరిశ్రమను ఇబ్బంది పెడతారని అనుకోవడంలేదని స్పష్టం చేశారు.

నానితో భేటీకి వెళ్లిన వర్మ… గంటపాటు చర్చ తర్వాత ఆయనతో పాటు నాన్ వెజ్ లంచ్ కూడా చేశారు. అనంతరం మళ్లీ వీరిద్దరూ కూర్చుని చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీలో సినిమా టికెట్ల ధరల సమస్యకు ఓ పరిష్కారం లభిస్తుందని టాలీవుడ్ తో పాటు ఏపీ ప్రభుత్వ వర్గాలు, సినీ అభిమానులు కూడా అంచనా వేసుకుంటున్నారు.